Site icon NTV Telugu

Atchannaidu: సీఎం జగన్ అరాచక రాజకీయాలను కట్టిపెట్టాలి..!

Atchannaidu

Atchannaidu

సీఎం వైఎస్‌ జగన్ అరాచక రాజకీయాలను కట్టిపెట్టాలని ఫైర్‌ అయ్యారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో చోటు చేసుకున్న పరిస్థితులపై స్పందించిన ఆయన.. ప్రతిపక్షనేత చంద్రబాబు కాన్వాయ్ పై దాడి ప్రజాస్వామ్యంపై దాడే అన్నారు.. చంద్రబాబు పర్యటన సందర్భంగా రామకుప్పం మండలం కొల్లుపల్లిలో వైసీపీ నేతలు.. టీడీపీ కార్యకర్తలపై దాడి చేసి గాయపర్చడం హేయమైన చర్యగా మండిపడ్డ ఆయన.. ఈ ఘటనకు సీఎం వైఎస్‌ జగన్, జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు.. ఇకనైనా సీఎం జగన్ ఇటువంటి అరాచక రాజకీయాలను కట్టిపెట్టాలని హితవు పలికారు.

Read Also: Munugode By Election: మునుగోడు బరిలో వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ.. త్వరలో అభ్యర్థి ప్రకటన..!

రేపనేది ఒకటి ఉంటుందన్న విషయాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టిలో పెట్టుకొని మసలుకోవాల్సిందిగా హెచ్చరించారు అచ్చెన్నాయుడు.. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా నాటి తెలుగుదేశం ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే మీరు పాదయాత్ర చేయగలిగేవారా..? అని ప్రశ్నించిన ఆయన.. కనీసం ఇంటినుంచి బయటకు రాగలిగేవారా? అని నిలదీశారు.. జగన్ నేతృత్వంలో వైసీపీ నేతలు పాల్పడుతున్న దుశ్చర్యలకు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదు అని వార్నింగ్‌ ఇచ్చారు. దుష్ప్రచార, ఎదురుదాడి మానుకొని.. రాళ్లదాడికి పాల్పడిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గూండాలపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్‌ చేశారు అచ్చెన్నాయుడు. కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.. ఆయన పర్యటిస్తున్న రూట్‌లో పెద్ద ఎత్తున వైసీపీ జెండాలు, తోరనాలు ఏర్పాటు చేయడంతో.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్ని విషయం తెలిసిందే.

Exit mobile version