ఏపీ అసెంబ్లీలో ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్‌పై టీడీపీ నేత అచ్చెన్నాయుడు పెదవి విరిచారు. సంక్షేమ పథకాలన్నీ సీఎం జగన్ నిర్వీర్యం చేశారని ఆయన ఆరోపించారు. పాత పథకాలకు పేరు మార్చి అమలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నిధులపై ప్రభుత్వం ఆధారపడుతోందని.. అప్పుల కోసం తిరగడం తప్ప సంక్షేమం గురించి జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు దారి మళ్లిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల నుంచి పన్నుల రూపేణా ఆదాయం పెంచుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
కాగా రూ. 2.56 లక్షల కోట్ల బడ్జెట్‌లో నిధులు ఎక్కడి నుంచి వస్తాయనేది ముఖ్యమైన విషయం అని ఎమ్మెల్సీ శ్రీనివాసులురెడ్డి వ్యాఖ్యానించారు. జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారో చెప్పలేదని.. యువతకు కొత్త ఉద్యోగాలు ఎలా భర్తీ చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధాని అమరావతికి బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం దారుణమని ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆరోపించారు. రూ. 64 వేల కోట్లు రుణాలు, రూ. 67 వేల కోట్లు కేంద్రం నుంచి వచ్చే నిధులుగా చెప్పారని ఆయన పేర్కొన్నారు.
