NTV Telugu Site icon

Kidnap Woman: కిడ్నాప్‌ చేయడంలో ఆరితేరిన మహిళ.. అప్పుడు తప్పించుకుంది.. ఇప్పుడు దొరికింది

Kidnap

Kidnap

Kidnap Woman: గుంటూరులో వరుసగా కిడ్నాప్‌లకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నాప్‌ల వ్యవహారంలో నాగమ్మ అనే ఓ మహిళ కీలక సూత్రధారిగా ఉందన్నారు. కిడ్నాప్ వ్యవహారం తెలియగానే సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేశామని.. పిల్లల్ని డబ్బు కోసమే నాగమ్మ గుంటూరు నుంచి తీసుకువెళ్లి జంగారెడ్డిగూడెంలో అమ్మేసిందని పోలీసులు చెప్పారు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరులో ఇటీవల జరిగిన బాలుడు కిడ్నాప్ వ్యవహారం సంచలనం సృష్టించింది. ప్రభుత్వ హాస్పిటల్‌లో పిల్లలకు భద్రత లేదన్న ప్రచారాన్ని మరొకసారి తెరమీదకు తెచ్చింది. అప్పటివరకు అమ్మ కొంగు చాటున ఆడుకుంటున్న పిల్లవాడు ఓ మాయలేని మాటలతో కిడ్నాప్‌కు గురయ్యాడు. చాక్లెట్లు కొనిస్తానంటూ నాగమ్మ అనే మహిళ ప్రభుత్వ హాస్పిటల్ నుండి ఐదేళ్ల వర్షిత్‌ను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లిపోయింది. ఈ ఒక్క ఘటనే కాదు ఇంతకుముందు నెల రోజుల క్రితం అరండల్ పేటలో ఇలాగే ఓ పిల్లాడిని కిడ్నాప్ చేసుకొని వెళ్ళింది అదే మహిళ. అప్పుడు చేస్తే పోలీసులు పట్టుకోలేక పోయారు. మరొకసారి చేస్తే ఏమవుతుందిలే అన్న ధీమా కావచ్చు. లేకపోతే డబ్బులు మీద ఉన్న ఆశతో పిల్లల్ని తీసుకువెళ్లి అమ్మేయాలన్న తెగింపు కావచ్చు.

మొత్తంగా రెండు వరుస కిడ్నాప్లతో సంచలనం సృష్టించింది నాగమ్మ అనే మహిళ. గుంటూరుకు చెందిన నాగమ్మ ఈ వ్యవహారం మొత్తంలో సూత్రధారి. అయితే జంగారెడ్డిగూడెం ప్రాంతంలో తమ బంధువుల కు పిల్లలు లేరన్న విషయాన్ని గమనించిన నాగమ్మ గుంటూరు నుంచి పిల్లల్ని తీసుకువచ్చి అమ్మేందుకు ప్రణాళిక వేసింది. ఇదే విషయాన్ని బంధువులకు చెప్పింది. నేను పిల్లల్ని తీసుకువచ్చి ఇస్తాను నాకు ఏమి ఇస్తారు అంటూ బేరం మాట్లాడింది. ఒక్కో పిల్లవాడికి రూ.30వేల చొప్పున డీల్ కుదుర్చుకుంది. ముందస్తుగా ఓ పిల్లవాడ్ని తీసుకువెళ్లే అమ్మేసిన నాగమ్మ తనకు ఇంకా ఫర్వాలేదు.. ఎవరు తనను గుర్తుపట్టలేరని భావించింది. అంతే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుండి మరో పిల్లోడిని తీసుకొని కిడ్నాప్ చేసి జిల్లా సరిహద్దులు దాటించేసింది. జంగారెడ్డిగూడెంలో ఉన్న తమ బంధువులకు అప్పజెప్పింది. అయితే కేవలం నాగమ్మ డబ్బు కోసం చేసిన ఈ కిడ్నాప్లు రెండు మాత్రమేనా? ఇంకా ఏమన్నా ఉన్నాయా అన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి.

అయితే పోలీసులు మాత్రం నాగమ్మకు గత నేరచరిత్ర లేదని, కేవలం ఈ రెండు కిడ్నాప్‌ల వ్యవహారంలోనే పాత్ర ఉందని నమ్ముతున్నారు. అయితే వెనకమాల ఓ వ్యక్తి సాయం చేశాడన్న విషయాన్ని సైతం పోలీసులు చెప్తున్నారు. ఎక్కడైతే పిల్లల్ని అజాగ్రత్తగా వదిలేస్తున్నారో, ఎక్కడైతే హడావుడి ప్రాంతాల్లో పిల్లల సంచరిస్తున్నారో అక్కడికి వెళ్లి పిల్లలకు మాయమాటలు చెప్పి చాక్లెట్లు కొనిపిస్తామని ఆశపెట్టి నేరుగా పిల్లలను తీసుకొని వెళ్లి జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు కిడ్నాపర్లు.. ఇదంతా ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టులో జరగటం లేదు. పబ్లిక్‌గా బస్సుల్లోనే తరలిస్తున్నారు. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు.

Read Also: Minister Roja: కొడాలి నానికి మంత్రి రోజా బర్త్ డే విషెస్.. అన్నయ్య అంటూ ఆప్యాయంగా పిలుపు

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పిల్లవాడు అదృశ్యం కాగానే వర్షిత్ తల్లిదండ్రులు ఆందోళన చెందారు. హాస్పిటల్లో ఉన్న పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీ కెమెరాలు ఫొటోస్ చూసి మహిళను గుర్తించిన పోలీసులు ఆ వెంటనే తీసుకున్న చర్యలు ఏంటి? పిల్లవాడితో సహా మహిళ జిల్లా సరిహద్దు దాటితే పోలీసులంతా ఏం చేస్తున్నారు? సీసీ కెమెరాలు ,ప్రతి సెంటర్లో పోలీసులు ట్రాఫిక్ కానిస్టేబుళ్లు, పోలీస్ వ్యవస్థ ఎంత మంది ఉన్నా ఓ పిల్లవాడిని ఓ మహిళ జిల్లా దాటించగలిగిందంటే మామూలు విషయం కాదు. అదే విధంగా గడిచిన నెల రోజుల్లోనే రెండు కిడ్నాప్‌లు చేసే అంత తెగింపు ఆ మహిళ చేసింది అంటే దాని వెనక బలమైన కారణమే ఉంటుందని ప్రజలు నమ్ముతున్నారు. దీనిపై పోలీసులు సమగ్ర విచారణ చేయాలని కోరుతుున్నారు. ప్రస్తుతానికి ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేశారు. నాగమ్మతో పాటు ఆమెకు సహకరించిన మరో వ్యక్తిని అదేవిధంగా పిల్లలను కొనుగోలు చేసిన ఇద్దరినీ అరెస్ట్ చేశారు. అయితే మిగిలిన వారి పాత్ర ఏంటి? ఎంత డబ్బులు చేతులు మారాయి ? కేవలం రూ.30వేల కోసం ఒక్కో పిల్లవాడిని అమ్మేసిందా? రూ.30వేలు పెట్టి కొనుక్కొని పిల్లవాడిని ఏం చేసుకుంటారు. పిల్లలు లేని వాళ్ళు ధైర్యంగా అఫీషియల్‌గా వెళ్లి ఎక్కడైనా పిల్లల్ని దత్త తీసుకోవచ్చు. కానీ ఇలా దొంగ చాటుగా దొంగతనంగా తీసుకువెళ్లిన పిల్లల్ని ఏం చెప్పి పెంచుకుంటారు? అదేవిధంగా పిల్లల్ని ఈ విధంగా దర్జాగా కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటే అటు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గాని బహిరంగ ప్రదేశాల్లో ఉన్న భద్రత వ్యవస్థ గాని ఏం చేస్తుంది? అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌తో కలిసి సమీక్ష నిర్వహిస్తామని గుంటూరు ఎస్పీ చెబుతున్నారు.

ప్రజలకు కష్టాలు వస్తే చెప్పుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు ఎత్తని పరిస్థితి కొంతమంది పోలీస్ అధికారుల తీరులో ఉంది. అలాంటప్పుడు కిడ్నాప్లు జరగకుండా దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్తున్న ఉన్నతాధికారుల మాటలు ఎలా అమలు అవుతాయి? ముందు క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బంది పనితీరును మెరుగుపరచుకుంటే, ప్రజలకు కష్టం వచ్చినప్పుడు స్పందించాలన్న స్పృహ ఉంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కావంటూ గుంటూరు వాసులు అభిప్రాయపడుతున్నారు.

Show comments