Site icon NTV Telugu

Karanam Balaram: మంత్రి కల నెరవేరేనా?

రాజకీయాల్లో 40ఏళ్లకు పైగా ఉన్న సీనియర్ నేత. ఆయనతో రాజకీయ ప్రస్ధానం మొదలు పెట్టిన నాయకులు సీఎంలై.. మంత్రులై చక్రం తిప్పారు. ఆయనకు మాత్రం మంత్రి పదవి అందని ద్రాక్షగా మారింది. ఆయన గెలిస్తే పార్టీ అధికారంలోకి రాదు.. పార్టీ అధికారంలోకి వస్తే ఆయన గెలవరు. ప్రస్తుతం పార్టీ మారి అధికారపార్టీ పంచన చేరారు. ఈసారైనా మంత్రి పదవి వరిస్తుందా? అసలు ఆయన అలాంటి ఆశలు పెట్టుకున్నారా?

ఇంత వరకు మంత్రి కాని కరణం బలరాం
కరణం బలరాం. ఏపీ రాజకీయాల్లో పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా.. ఒకసారి ఎంపీగా గెలిచారు. ఆయన గెలిస్తే ఆ పార్టీ అధికారంలో ఉండదు. ఆయన ఉన్న పార్టీ అధికారంలో ఉంటే ఆయన గెలవరు. దీంతో మంత్రి పదవి రాకుండా పోయింది. ఓడిన నేతలకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రులను చేసిన చంద్రబాబు.. బలరామ్‌కు ఎమ్మెల్సీ ఇచ్చారు కానీ మంత్రిని చేయలేదు.

ఒంగోలులో ఇందిరాగాంధీకి రక్షణగా నిలబడ్డ బలరాం
వైఎస్.. చంద్రబాబు వంటి సీనియర్ నేతలతోపాటుగా రాజకీయ ప్రస్ధానాన్ని మొదలు పెట్టినా బలరాం ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా మంత్రి పదవి చేపట్టలేదు. యూత్ కాంగ్రెస్ నాయకుడిగా రాజకీయ అరంగ్రేటం చేసిన కరణం.. 1977లో ఎన్నికల ప్రచారానికి ఒంగోలు వచ్చిన ఇందిరాగాంధీ మీద రెడ్డి కాంగ్రెస్ నేతల దాడి చేయబోతే.. ఆమెకు రక్షణగా నిలబడి దేశవ్యాప్తంగా అప్పుడు పాపులర్ అయ్యారు. 1978లో కాంగ్రెస్‌ ఐ తరఫున అద్దంకిలో పార్టీ అభ్యర్థిగా బలరాం పేరును స్వయంగా ఇందిరాగాంధీ సిఫారసు చేశారు. ఆ ఎన్నికలలో గెలిచి తొలిసారి శాసనసభలో అడుగు పెట్టారు బలరాం. ఆ తర్వాత టీడీపీలో చేరారు.

2019లో ఎమ్మెల్యేగా గెలిచాక.. వైసీపీకి జైకొట్టిన బలరాం
బలరాం స్వగ్రామం చీరాలకు దగ్గరగా ఉండే తిమ్మసముద్రం అయినప్పటికీ రాజకీయ ప్రస్ధానం మొత్తం అద్దంకి, మార్టూరు నియోజకవర్గాలతో ముడిపడి ఉంది. 2019 ఎన్నికల నాటికి టీడీపీలో ఉన్న ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరటంతో.. కరణంను చీరాల అభ్యర్థిగా బరిలో దించింది తెలుగుదేశం పార్టీ. చీరాలలో 18వేల మెజారిటీతో గెలిచారు బలరాం. అయితే ఆయన గెలిచి.. టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో ప్రతిపక్షపార్టీ ఎమ్మెల్యేగా ఉండిపోవాల్సి వచ్చింది. ఆమంచి ఓడినప్పటికీ ఇంచార్జ్‌ హోదాలో ఎమ్మెల్యే అధికారాన్ని చెలాయిస్తూ నియోజకవర్గంలో పనులు చేసుకుంటూ పోయారు. దీంతో కరణం.. ఆమంచి మధ్య హోరాహోరీగా కార్యక్రమాలు నడిచాయి. చివరకు కుమారుడు వెంకటేష్‌ రాజకీయ భవిష్యత్‌ గురించి ఆలోచించారో ఏమో సీఎం జగన్‌కు జైకొట్టారు బలరాం.

ఇప్పుడైనా కేబినెట్‌లో చోటు దక్కుతుందా?
వైసీపీలో చేరినా తమ నేతకు సరైన గుర్తింపు లేదన్నది బలరాం వర్గీయుల టాక్‌. కరణం వెంకటేష్‌కు ఏదైనా కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి ఇస్తారని భావించినా సాధ్యం కాలేదు. కేవలం ఆమంచి స్పీడ్‌కు బ్రేకులు వేయడం మినహా.. వైసీపీలోకి వెళ్లడం వల్ల కలిగిన ప్రయోజనం ఏదీ లేదన్నది అనుచరుల ఆవేదన. ప్రస్తుతం కేబినెట్‌లో మార్పులు చేర్పులకు సమయం దగ్గరపడటంతో కరణం బలరాం చర్చల్లోకి వచ్చారు. కొత్తగా ఏర్పడే బాపట్ల జిల్లాలోకి చీరాల వెళ్తుండటంతో ఆయనకు కలిసొస్తుందని అనుచరులు లెక్కలు వేస్తున్నారు.

వైసీపీ బలోపేతం కోసం మంత్రిని చేస్తారని లెక్కలు
బాపట్ల పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ బలంగా ఉంది. అక్కడ వైసీపీని బలోపేతం చేయాలంటే సామాజికవర్గం పరంగా కూడా గట్టి నేత ఆపార్టీకి కావాలనేది బలరాం అనుచరుల లెక్క. కరణం బలరామ్‌ను కేబినెట్‌లోకి తీసుకుంటే వైసీపీ బలోపేతం కావడంతోపాటు ఆయన సామాజికవర్గానికి కూడా ప్రాధాన్యం కల్పించినట్టు అవుతుందని అంచనా వేస్తున్నారట.

బలరాం మంత్రి ఆశ నెరవేరుతుందా?
మాజీ ఎమ్మెల్యే ఆమంచి సీటు విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. పార్టీని బలోపేతం చేసేందుకు బలరాం, ఆయన కుమారుడు వెంకటేష్‌ను పర్చూరు, అద్దంకి పంపుతారనే ప్రచారం జరుగుతోంది. అప్పుడు ఆమంచికి లైన్‌ క్లియర్‌ అయినట్టే. వచ్చే ఎన్నికల్లో కరణం కుమారుడు వెంకటేశే బరిలో నిలిచే అవకాశాలు ఉండటంతో బలరాం మంత్రి పదవి ఆశలు నెరవేరుతాయా? ఆయన కోరిక తీరుతుందా? సీఎం జగన్‌ బలరామ్‌ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూడాలి.

Exit mobile version