టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లపై వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు రైతులకు ద్రోహం చేశారని.. చంద్రబాబు అధికారంలో ఉంటే కరువు కాటకాలు విలయతాండవం చేస్తుంటాయని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 471 మంది రైతులు అప్పుల ఊబిలో కూరుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. వీరందరికీ తమ ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించిన విషయం వాస్తవమా కాదా అని నిలదీశారు. ఈ అంశంపై చంద్రబాబు దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ కూడా సమాధానం చెప్పాలన్నారు. రూ.5,500 కోట్లను సీఎం జగన్ ఒక్క బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేస్తే ఎందుకు హర్షించ లేకపోతున్నారని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. పంటల బీమా కింద రాష్ట్ర ప్రభుత్వం 6,680 కోట్లు ఖర్చు చేసిందన్నారు. రైతు, రాష్ట్రం, కేంద్రం చెల్లించాల్సిన మూడు వంతులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి కూడా అభినందించారని గుర్తుచేశారు. కేంద్రం వాటా భరిస్తామని స్పష్టం చేశారు.
Read Also: YSRCP: శ్రీకాంత్‌రెడ్డికి కేబినెట్ హోదా.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
చంద్రబాబుకు అసలు నీతి నిజాయితీ ఉందా అని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. రైతులకు ఉచితంగా కరెంటు ఇస్తే కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలని చెప్పిన వ్యక్తి చంద్రబాబు అని.. డ్రిప్ ఇరిగేషన్ పేరుతో 700 కోట్లు బకాయిలు పెట్టి వెళ్లాడని.. దీంతో అనేక కంపెనీలు మూతపడ్డాయన్నారు. ఎవరెన్ని చేసినా జగన్ తలరాతను ఎవరూ మార్చలేరన్నారు. రెండు చోట్ల పోటీ చేసినా ఓడిపోయాడు అంటే ప్రజలు తిరస్కరించారని అర్ధమని.. అయినా ప్రజల్లో తిరగడానికి పవన్ కళ్యాణ్‌కు సిగ్గుండాలని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ తక్షణమే రాజకీయాల నుంచి నిష్క్రమించాలన్నారు. పవన్ కళ్యాణ్ చెప్పింది మూడు ఆప్షన్లు.. కానీ అమలు చేసేది నాలుగో ఆప్షన్ అని చురకలు అంటించారు. చంద్రబాబు దగ్గర ప్యాకేజీనే నాలుగో ఆప్షన్ అన్నారు. 1800 ఎకరాల్లో నర్సరీ దెబ్బ తిందని ప్రాథమిక అంచనా అని.. వర్షాలు తగ్గితే కానీ పూర్తి స్థాయిలో అంచనా వేయలేమన్నారు. ఎప్పటిలానే పంట నష్టానికి ఈ సీజన్‌లోనే నష్ట పరిహారం అందజేస్తామన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పర్యవేక్షణ చేస్తామన్నారు.