Site icon NTV Telugu

దేశంలోనే కడప జిల్లాకు ఉత్తమ జాతీయ అవార్డు

ఏపీలోని కడప జిల్లాలకు జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు లభించింది. నేషనల్ వాటర్ అవార్డ్స్-2020లో భాగంగా మొత్తం 11 విభిన్న విభాగాల్లో 57 అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం కడప జిల్లాకే అవార్డు వచ్చింది. కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ శుక్రవారం ఈ అవార్డులను ప్రకటించారు. దక్షిణాది నుంచి కేరళలోని తిరువనంతపురం జిల్లా మొదటి స్థానం దక్కించుకోగా… ఏపీలోని కడప జిల్లాకు రెండో స్థానం దక్కింది. రాష్ట్రాల విభాగంలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు మొదటి మూడు అవార్డులను సొంతం చేసుకున్నాయి.

Read Also: మనిషిని నాశనం చేసే ఐదు విషపూరిత అలవాట్లు

నీటి సంరక్షణకు కృషి చేసిన జిల్లాలు, పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలు, పాఠశాలలు, గృహ సంక్షేమ సంఘాలు, మతపరమైన సంఘాలు, పరిశ్రమలు, స్వచ్ఛంద సంస్థలు, నీటి వినియోగ సంఘాలకు ప్రతి ఏడాది నేషనల్ వాటర్ అవార్డులను కేంద్ర ప్రభుత్వం అందజేస్తోంది. 2020 ఏడాదికి సంబంధించి ఒక్క కేటగిరీలో మినహా ఏ కేటగిరీలోనూ తెలుగు రాష్ట్రాలకు అవార్డు దక్కలేదు. ప్రస్తుతం ప్రతి ఏడాది 1,100 శతకోటి ఘనపు మీటర్ల మేర నీటి అవసరం ఉందని… ఇది 2050 కల్లా 1,447 శతకోటి ఘనపు మీటర్లకు చేరుతుందని కేంద్రం పేర్కొంది. ప్రపంచంలో 18 శాతం జనాభా భారత్‌లోనే ఉన్నా నీటి వనరులు మాత్రం 4 శాతమే ఉన్నాయని.. అందుకే నీటి సంరక్షణకు అసాధారణ రీతిలో పనిచేసే సంస్థలను ప్రోత్సహించేందుకు 2018 నుంచి జాతీయ అవార్డులను ఇస్తున్నామని వివరించింది.

Exit mobile version