Site icon NTV Telugu

KA Paul: ఢిల్లీలో కేఏ పాల్‌ మౌనదీక్ష.. ఆగస్టు 15 తర్వాత ఆమరణ దీక్ష..

Ka Paul

Ka Paul

హస్తిన వేదికగా ఆందోళనకు దిగారు కేఏ పాల్.. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలంటూ డిమాండ్‌ చేస్తూ వస్తున్న ఆయన.. ఇవాళ ఢిల్లీలోని రాజ్‌ ఘాట్‌లో మౌనదీక్ష చేపట్టారు.. మధ్యాహ్నం 12 గంటలకు దీక్షకు దిగిన ఆయన.. మధ్యాహ్నం 3 గంటల వరకు తన దీక్ష కొనసాగుతుందని ప్రకటించారు.. తెలుగురాష్ట్రాల విభజన చట్టాన్ని అమలు చేయాలని కోరారు.. 8 ఏళ్లుగా విభజన హామీలను కేంద్రం, ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేయడం లేదని దుయ్యబట్టారు.. విభజన హామీలు అమలు కాలేదు, అందుకే తాను రాజ్ ఘాట్ లో మౌన దీక్ష చేస్తున్నానని పేర్కొన్న ఆయన.. జీవితంలో మొట్ట మొదటిసారిగా రాజ్ ఘాట్ లో మూడు గంటల పాటు మౌన దీక్ష చేస్తున్నా.. నాతోపాటు మూడు గంటల పాటు దీక్ష చేయలేని వారు మూడు నిముషాలైనా దీక్ష పాటించాలని సూచించారు.

Read Also: Singapore Open: ఫైనల్‌కు దూసుకెళ్లిన తెలుగు తేజం పీవీ సింధు

ఇక, తాను రాజ్‌ఘాట్‌లో మౌన దీక్ష చేస్తుంటే.. ఈరోజు 2.10 కోట్ల మంది నాతో పాటు ఉపవాసం ఉంటున్నారని తెలిపారు కేఏ పాల్.. విభజన హామీల అమలు కోసం వచ్చే బుధవారం ఉదయం జంతర్ మంతర్ వద్ద నిరసన చేపడతానని ప్రకటించారు.. విభజన హామీలు అమలు చేయకపోయే ఆగస్టు 15వ తేదీ తర్వాత ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు.. తెలుగు ప్రజల సత్తా చూపకపోతే విభజన హామీలు అమలు కావన్న ఆయన.. అందుకే తాను పోరాటానికి దిగుతున్నట్టు వెల్లడించారు. కాగా, ఈ మధ్య తెలంగాణలో పరిస్థితులపై ‘ఆరా’ నిర్వహించిన ఎన్నికల సర్వేపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మండిపడిన విషయం తెలిసిందే.. ఆరా మస్తాన్ పిచ్చిపిచ్చి సర్వేలు చేస్తే ప్రజలు ఊళ్లలో తిరగనివ్వరని హెచ్చరించిన ఆయన.. దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తానన తెలిపారు.. టీఆర్ఎస్ కు 36 శాతం, బీజేపీకి 30 శాతం ఓట్లు వస్తాయని మస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. అసలు ప్రజాశాంతి పార్టీకి తెలంగాణలో 60 శాతం ఓటు బ్యాంకు ఉందని కేఏ పాల్ పేర్కొన్న విషయం విదితమే.

Exit mobile version