K Narayana Swamy Fires on Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాధిపతి పవన్ కళ్యాణ్‌లపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి విమర్శలు గుప్పించారు. తనని ఎవరైనా ప్యాకేజ్ స్టార్ అని పిలిస్తే.. ఆ వైసీపీ నేతలను చెప్పుతో కొడతానని పవన్ కళ్యాన్ అనడం ఏమాత్రం సరికాదని అన్నారు. స్పెషల్ స్టేటస్‌ను వదిలి.. ప్యాకేజి క్రింద ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రబాబు ధనదాహం కోసం అమ్మేశారని ఆరోపించారు. చంద్రబాబుకు అప్పుడే ప్యాకేజీ బాబు అని ముద్ర పడిందని.. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కి కూడా అదే ముద్ర పడిందని చెప్పారు. కాపుల గురించి మాట్లాడే హక్కు పవన్‌కి లేదని.. ముద్రగడ పద్మనాభంను చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెట్టినప్పుడు పవన్ ఏమయ్యాడని ప్రశ్నించారు. ఈ రోజు కుల, మత, పార్టీల రాజకీయంతో ముందుకు పరిగెడుతున్నారని విమర్శించారు. అదే సీఎం జగన్ మాత్రం కాపుల్లో ఐదు మందికి మంత్రి పదవి, ఒకరికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారన్నారు.
అంతకుముందు.. మూడు రాజధానులకు అనుకూలంగా గళం విప్పిన నారాయణ స్వామి, అమరావతి ప్రాంత రైతుల పాదయాత్రను కూడా తప్పుపట్టారు. దీనిని తెరవెనుక ఉండి చంద్రబాబు నడిపిస్తున్నారని ఆరోపణలు చేశారు. 29 గ్రామాల ప్రజలు మాత్రమే బాగుపడాలని చంద్రబాబు కోరుకుంటోన్నారని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ సారథ్యంలో తమ ప్రభుత్వం అన్ని ప్రాంతాలను సమంగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. ఇందులో భాగంగానే మూడు రాజధానుల విధానాన్ని తెరమీదకి తీసుకొచ్చారని స్పష్టం చేశారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ అనే తేడా లేకుండా.. అన్ని వర్గాల వారిని సమదృష్టితో చూస్తున్నారన్నారు. పేద ప్రజలు బాగుపడుతుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని, కొన్ని కార్పొరేట్ సంస్థలకు మేలు కలిగించేలా, తన బినామీల బాగు కోసం చంద్రబాబు వికేంద్రీకరణను వ్యతిరేకిస్తోన్నాడని మండిపడ్డారు. తెలంగాణ నుంచి వేరు పడిన సమయంలో హైదరాబాద్‌ను కోల్పోవడం వల్ల రాష్ట్రం ఎంతో నష్టపోయిందని.. ఇప్పుడూ అలాంటి వ్యవస్థ కోసమే చంద్రబాబు పోరాడుతున్నారని వెల్లడించారు.
