నరేంద్రమోదీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా బీజేపీ పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే పార్టీని బలోపేతం చేసేందుకు, సంస్థాగతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఆ పార్టీ నేతలు కసరత్తులు ప్రారంభించారు. అయితే.. ఈ సందర్భంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు, రేపు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. రాష్ట్రంలోని పోలింగ్ కేంద్రాలను బీజేపీ శక్తికేంద్రాలుగా మార్చింది. వాటికి ఇంఛార్జీలను నియమించింది. ఆయా శక్తి కేంద్రాల ఇంఛార్జీలతో విజయవాడలో నడ్డా భేటీ కానున్నారు.
సాయంత్రం 5 గంటలకు విజయవాడ నగర, ఎన్టీఆర్ జిల్లా పుర ప్రముఖులతో జేపీ నడ్డా భేటీ కానున్నారు. అనంతరం రాత్రి బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ, ప్రధాన కార్యదర్శులతో సమావేశమవుతారు జేపీ నడ్డా. అందులో పార్టీ భవిష్యత్ వ్యూహాలపై చర్చించనున్నారు. ఇదిలా ఉంటే… కొన్ని రోజులుగా ఏపీలో రాజకీయ పొత్తులపై చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఇప్పటికే బీజేపీ, జనసేన పొత్తు కొనసాగుతుండగా.. ఈ కూటమి నుంచి సీఎం అభ్యర్థిని జేపీ నడ్డా ఈ పర్యటనలో ప్రకటిస్తారమోనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
