అనంతపురం: టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని.. ముసలోడు అయినా చంద్రబాబే మేలు అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ఎమ్మెల్యేలు పల్లెలన్నీ తిరుగుతున్నారని.. వాలంటీర్‌ను వెంటబెట్టుకుని వెళ్లి మరీ జగనన్నను దీవించాలని ప్రాధేయపడుతున్నారని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
వైసీపీకి ఈరోజు కార్యకర్తలు లేరని.. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేల వెంట సచివాలయం సిబ్బంది, అధికారులు, పోలీసులు వెళ్తున్నారని విమర్శలు చేశారు. ఓ ఎంపీ అయితే ప్రజల పల్స్ పట్టుకోవాలి.. టీడీపీ వాళ్ళను లాక్కురండి అని వాలంటీర్లతో చెప్తుండటాన్ని తాను గమనించానన్నారు. సీఎం జగన్ వస్తున్నాడటంటే షాపులు మూసివేయాల్సిన పరిస్థితి నెలకొందని.. బందోబస్తులో 600 మంది పోలీసులు ఉంటున్నారని.. అంటే ప్రభుత్వం ఏ స్థాయిలో భయపడుతుందో అర్ధం చేసుకోవచ్చన్నారు. చంద్రబాబును మూసలోడు అంటున్నారని.. అయినా ఆయన బయట తిరుగుతున్నాడని జేసీ ప్రభాకర్‌రెడ్డి గుర్తుచేశారు.
పోలీసు అనే మహా వృక్షం కింద వైసీపీ పార్టీ ఉందని… ఆ పార్టీపై కార్యకర్తల్లో ద్వేషం చాలా ఉందని జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. టీడీపీ వాళ్లు ఇప్పటికే మూడేళ్లు ఇంట్లో కూర్చున్నారని.. తమ కార్యకర్తలు జైళ్లకు వెళ్లారని.. స్థానిక ఎన్నికల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. గతంలో తాను మాట్లాడితే 14 మంది వైసీపీ నేతలు తనపై మాట్లాడేవారన్నారు. టీడీపీ నేతలందరూ చంద్రబాబును సీఎంను చేసుకోవాలని.. అందుకోసం జైలుకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉండాలన్నారు. ఇప్పటికే సీటు తమకే కావాలని చాలా మంది సీనియర్ నేతలు అడుగుతున్నారని.. అయితే తమ నాయకుడు సీటు ఇవ్వనని.. త్యాగాలు చేయాలని సూచిస్తున్నారని జేసీ పేర్కొన్నారు.