NTV Telugu Site icon

Janasena Party: ‘జనవాణి’ పేరుతో కొత్త కార్యక్రమం.. ప్రజల విజ్ఞప్తులు స్వీకరించనున్న పవన్ కళ్యాణ్

Janasena Party Min

Janasena Party Min

ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఏపీలో జనసేన పార్టీ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ‘జనవాణి’ పేరుతో వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేసింది. దీని ద్వారా సామాన్య ప్రజల నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజ్ఞప్తులు స్వీకరించనున్నారు. జనవాణి కార్యక్రమంలో భాగంగా వచ్చే ఐదు ఆదివారాలు పవన్ ప్రజలకు ప్రత్యక్షంగా అందుబాటులో ఉండి వారి నుంచి వివిధ అంశాలపై అర్జీలను స్వీకరిస్తారని జనసేన పార్టీ వెల్లడించింది. తొలివిడత జనవాణి కార్యక్రమాన్ని జూలై 3న విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో నిర్వహిస్తామని తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పవన్ కళ్యాణ్ ప్రజలకు అందుబాటులో ఉంటారని వివరించింది.

Read Also: Andhra Pradesh: ఏబీ వెంకటేశ్వరరావుపై మరోసారి సస్పెన్షన్ వేటు

రెండో ఆదివారం కూడా విజయవాడలోనే జనవాణి కార్యక్రమం ఉంటుందని జనసేన పార్టీ వెల్లడించింది. అయితే మూడో ఆదివారం, నాలుగో ఆదివారం, ఐదో ఆదివారం జనవాణి కార్యక్రమాన్ని వరుసగా ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఉభయగోదావరి ప్రాంతాల్లో నిర్వహిస్తామని తెలిపింది. రాజకీయాలకు అతీతంగా, సామాన్యుడికి న్యాయం జరగాలన్న ఆకాంక్షతోనే ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశామని.. జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ స్వీకరించే ప్రతి అర్జీకి రసీదు ఇస్తామని.. అదే రోజు సాయంత్రానికి సదరు సమస్యలను సంబంధిత అధికారులకు చేరేవేసేందుకు ప్రయత్నిస్తామని జనసేన పార్టీ వివరించింది. తమ కేంద్ర కార్యాలయం నుంచి అర్జీల పురోగతిని ఫాలో అప్ చేస్తామని చెప్పింది. కాగా ప్రజల విశ్వాసాన్ని బలపరిచేలా ప్రజావాణి కార్యక్రమాన్ని చేపడతామని నాదెండ్ల మనోహర్ తెలిపారు.