అన్నమయ్య ప్రాజెక్టు విషాదానికి ఏడాది గడిచింది.. ఈ ప్రాజెక్టు తెగిపోవడంతో అపార ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది.. ఏకంగా 39 మంది ప్రాణాలు కోల్పోగా.. ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేట, నందలూరు మండలాల పరిధిలోని పులపత్తూరు, మందపల్లె, తొగూరుపేట, గుండ్లూరు, రామచంద్రాపురం గ్రామాలు తీవ్రంగా నష్టాన్ని చవిచూశాయి.. బాధితులు రోడ్డున పడ్డారు. అయితే, అన్నమయ్య ప్రాజెక్టు బాధితులకు సాయం అందించేందుకు జనసేన పార్టీ.. రేణిగుంటలో ఇవాళ మీడియాతో మాట్లాడిన జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకు పోవడంపై ఎంక్వైరీ రిపోర్ట్‌ను ఇప్పటికైనా ప్రభుత్వం బయట పెట్టాలని డిమాండ్ చేశారు.. డ్యాం కొట్టుకుపోయి ఏడాది అయినా.. నిర్వాసితులకు ప్రభుత్వం సాయం అందించలేదని విమర్శించారు.. నెల లోపు ప్రభుత్వం నిర్వాసితులను ఆదుకోకపోతే అన్నమయ్య కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు..
Read Also: Traffic Rules : ట్రాఫిక్ పోలీస్ కొత్త రూల్స్.. రాంగ్ సైడ్, ట్రిపుల్ రైడింగ్ చేస్తే భారీగా జరిమానా
ఇక, జనసేన జనసేన నేతల పర్యటన నేపథ్యంలో హౌసింగ్ శాఖ.. బాధితుల ఖాతాల్లో డబ్బులు వేసినట్లు ప్రచారం చేసిందని మండిపడ్డారు… కానీ, ఏ ఒక్క బాధితుడికి రూపాయి కూడా ప్రభుత్వం ఇచ్చింది లేదని విమర్శించారు.. అయితే, వచ్చే వారం బాధితులకు మరోసారి జనసేన సాయం అందిస్తుందని ప్రకటించారు. నిర్వాసితులకు సాయం చేయలేని వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి సీఎంగా కొనసాగే అర్హతలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నాదెండ్ల మనోహర్. కాగా, ప్రాజెక్టు పునర్నిర్మాణ విషయంపై ఇప్పటికే స్పందించింది ఏపీ ప్రభుత్వం.. 2.25 టీఎంసీల సామర్థ్యంతో, అదే స్థలంలో రూ.801కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మించడానికి ఇటీవల పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. ఇక, ఇళ్లు కొట్టుకుపోయిన బాధితులకు ఇళ్లు నిర్మించి ఇస్తామని, పంట నష్టం వాటిల్లిన రైతులకు ఎకరాకు రూ.12,500 పరిహారం, వేలాది ఎకరాల పొలాలు ముంపునకు గురై ఇసుకతో నష్టపోయిన రైతులకు పరిహారం, యువతకు ఉపాధి కల్పిస్తామని గతంలో సీఎం జగన్ హామీ ఇచ్చారు. రెండు మండలాల్లోని బాధిత కుటుంబాలన్నింటిలో ఒక్కటి కూడా ఇంతవరకు అమలు కాలేదని, ఏడాది గడిచినా ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో విఫలమైందని జనసేన ఆరోపిస్తోంది.. సరిగ్గా ఏడాది క్రితం నవంబర్ 18-19 రాత్రి వరదలు సంభవించిన ఒక రోజు తర్వాత తమ పార్టీ కార్యకర్తలు మరియు మహిళా సభ్యులే బాధితులకు చేరుకుని, ఆహారధాన్యాలు, ఆహార ప్యాకెట్లు, మందులు, ఇంటింటికీ సందర్శించి సహాయ సామగ్రిని అందించారని ఆయన గుర్తు చేశారు నాదెండ్ల మనోహర్.