Site icon NTV Telugu

Andhra Pradesh: 8 మంది ఐఏఎస్ అధికారులకు జైలుశిక్ష.. నాగబాబు పోస్ట్ వైరల్

కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఏఎస్ అధికారులకు ఏపీ హైకోర్టు రెండు వారాల పాటు జైలు శిక్ష విధించింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఐఏఎస్ అధికారులు క్షమాపణలు కోరడంతో జైలుశిక్షను తప్పించి సేవా కార్యక్రమాలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. ఏడాది పాటు సంక్షేమ హాస్టళ్లల్లో ప్రతి నెలలో ఒకరోజు సేవ చేయాలని తీర్పు ఇచ్చింది. ఒక రోజు పాటు కోర్టు ఖర్చులు భరించాలని ఐఏఎస్‌లను ఆదేశించింది. ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామ సచివాలయాల ఏర్పాటు చేయవద్దన్న హైకోర్టు ఆదేశాలను అధికారులు ధిక్కరించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.

అయితే 8 మంది ఐఏఎస్ అధికారులకు హైకోర్టు శిక్ష విధించడంపై జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబు తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా స్పందించారు. వైసీపీ పెద్దలు చేసిన పాపానికి ఐఏఎస్ అధికారులు బ‌లి అవుతున్నార‌న్న కోణంలో ఆయన కామెంట్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఐఏఎస్ అధికారులది కాదని.. ప్రభుత్వ పెద్దలదే నాగబాబు విమర్శించారు. వైసీపీ ప్రజాప్రతినిధులు చేసిన పాపానికి ఐఏఎస్ అధికారులు బలి అవుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ప‌రిపానలన ఎలా ఉండ‌కూడ‌ద‌న్న దానిని ప్రస్తుత ఏపీ ప్రభుత్వమే ఉదాహ‌ర‌ణ అని అభివర్ణించారు. స‌మాజానికి, రాజ్యాంగానికి సంర‌క్షకులుగా ఉండాల్సిన అధికారులు వైసీపీ మాయ‌లో ప‌డిపోయార‌ని, వారంతా ఇప్పుడు వైసీపీ కాపలా కుక్కలుగా మారిపోయార‌ని నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Exit mobile version