Site icon NTV Telugu

YSRCP: వైసీపీకి తలనొప్పి..! బందరు పంచాయతీ..! గన్నవరం రచ్చ..!

Machilipatnam Gannavaram

Machilipatnam Gannavaram

అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి కృష్ణా జిల్లాలో పరిణామాలు తలనొప్పిగా మారుతున్నాయి.. నేతల మధ్య ఉన్న అంతర్గత విబేధాలు బహిర్గతం అవుతున్నాయి.. బహిరంగ విమర్శలు, ఆరోపణలతో.. ఓ వైపు బందరు పంచాయతీ నడుస్తుండగా.. మరోవైపు గన్నవరంలో రచ్చగా మారుతున్నాయి.. అంతేకాదు గన్నవరంలో కొత్త ఈక్వేషన్‌ మొగ్గ తొడుగుతున్నాయి.. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టుగా.. రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు యార్లగడ్డ వెంకట్రావ్‌… దుట్టాకి చెందిన కొత్త ఆస్పత్రి శంకుస్థాపన కార్యక్రమానికి యార్లగడ్డ హాజరు కావడం చర్చగా మారింది.. స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విరుద్ధంగా ఇరు వర్గాలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నట్టుగా టాక్ నడుస్తోంది.. వచ్చే ఎన్నికల్లో గన్నవరం అభ్యర్ధిని నేనే అంటున్నారు యార్లగడ్డ.. ఆ మేరకు అధిష్టానాన్ని ఒప్పిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Vijaya Sai Reddy: చంద్రబాబు సీబీఐ కామెంట్స్‌కు సాయిరెడ్డి కౌంటర్

అంతేకాదు, దుట్టా టోన్‌లోనే వల్లభనేని వంశీపై మట్టి అక్రమాల ఆరోపణలు గుప్పించారు యార్లగడ్డ.. వాటిపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కౌంటర్‌ ఎటాక్‌ చేశారు. మట్టి అంటే గ్రానైటో, బాక్సైటో, బంగారమో, వెండో కాదు దోచుకోవటానికి అంటున్నారు వంశీ.. మట్టి తోలితే డీజిల్‌ ఖర్చులు కూడా రావని కౌంటర్‌ ఇచ్చారు. మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి ఎవరనేది హైకమాండ్ డిసైడ్ చేస్తుందన్నారు వంశీ.. ఇక, మచిలీపట్నం పంచాయతీ హైకమాండ్‌ వద్దకు చేరింది.. ఎంపీ బాలశౌరిని.. మాజీ మంత్రి పేర్ని నాని వర్గం అడ్డుకోవడంతో రచ్చ మొదలైన విషయం తెలిసిందే కాగా.. పేర్ని నాని ఆగడాలను మీడియాకు ప్రెస్ నోట్ రూపం లో విడుదల చేసింది బాలశౌరి వర్గం.. రచ్చ రోడ్డెక్కటంతో హైకమాండ్ రంగంలోకి దిగింది.. మీడియా ముందు మాట్లాడవద్దని బాలశౌరికి పార్టీ పెద్దలు సూచించారు.

మరోవైపు మచిలీపట్నం వచ్చి సీఎం వైఎస్‌ జగన్‌పై విమర్శలు గుప్పించిన బీజేపీ, టీడీపీ నేతలతో పేర్ని నాని వేదిక ఎలా పంచుకుంటారని ఎంపీ బాలశౌరి వర్గం ప్రశ్నిస్తోంది.. మరో నియోజకవర్గంలో కార్యక్రమానికి సుజనా చౌదరి ఆహ్వానించినా.. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే హాజరుకాలేదంటున్నారు.. అయితే, ఈ వివాదం పై పేర్ని నాని వర్గం నోరువిప్పడం లేదు.. నాని ఆరోగ్యం బాగోలేదని ఆయన అనుచరులు చెబుతున్నారు.. త్వరలోనే మీడియా సమావేశం నిర్వహిస్తారని.. ఎంపీ బాలశౌరి చెబుతున్నవి అన్ని అబద్ధాలని కొట్టిపారేస్తోంది పేర్ని నాని వర్గం.. మొత్తంగా కృష్ణా జిల్లాలో ఓ వైపు బందరు పంచాయతీ.. మరో వైపు గన్నవరం రచ్చ గరంగరంగా మార్చేశాయి.

Exit mobile version