Heavy Rush: తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండగ సందడి మొదలైంది. ప్రయాణికుల రద్దీతో రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు నిండిపోయాయి. తెలంగాణలోని వివిధ జిల్లాలకు ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా పండగ నేపథ్యంలో ప్రయాణాలు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, చర్లపల్లి రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంది. ఇక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఇసకేస్తే రాలని జనం ఉన్నారు. దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే 188 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయగా.. పండగ సందర్భంగా అదనంగా 33 శాతం అదనపు ఛార్జీలను వసూలు చేస్తుంది దక్షిణ మధ్య రైల్వే. అలాగే, సంక్రాంతి పండగ ప్రయాణాలతో పాటు శబరి, కుంభమేళాకు వెళ్లే వారు కూడా ఉండటంతో రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.
Read Also: Sankranti Effect: సంక్రాంతికి పల్లెబాట పట్టిన ప్రజలు.. టోల్ ప్లాజాల దగ్గర భారీగా ట్రాఫిక్!
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనపు బస్సులు, రైళ్లను నడపాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు. ఇక, హైదరాబాద్, విజయవాడ రైల్వేస్టేషన్లలోనూ ఇదే పరిస్ధితి కొనసాగుతుంది. సుదూర ప్రాంతాల నుంచి వస్తోన్న ట్రైన్స్ అన్నీ ఎప్పుడో నిండిపోగా ఇప్పుడు ఊరెళ్లే వారికి ప్రత్యేక రైళ్లపైనే ఆధారపడాల్సిన పరిస్ధితి ఏర్పడింది. దక్షిణ మధ్య రైల్వే కూడా ప్రత్యేక రైళ్లను నడిపిస్తు్న్న కూడా ట్రైన్స్ లేవని అంటున్నారు.ప్రత్యేక రైళ్లు, జనరల్ బోగీలు పెంచాలని అధికారులను ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, నర్సీపట్నం, కాకినాడ, అమలాపురం, భీమవరానికి అదనపు బస్సు సర్వీసులు కేటాయించామని ఆర్టీసీ అధికారులు తెలియజేస్తున్నారు.