ఏపీలో చేపట్టిన జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. ఈ కార్యక్రమం 11 రోజుల పాటు కొనసాగింది. ఈ నెల 11వ తేదీన ప్రారంభమయిన జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ఊరూరా, వాడవాడలా ముందుకి సాగిందని వైసీపీ తెలిపింది. 78 లక్షల గృహాలకు ఈ కార్యక్రమం సాగింది. మొత్తం 59 లక్షలమంది 82960-82960 నెంబర్ కి మిస్డ్ కాల్స్ ఇచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారని వైసీపీ వెల్లడించింది. 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.
ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు, సమన్వయకర్తలు, కన్వీనర్లు, గృహ సారథులు, వలంటీర్లు కలసికట్టుగా ఇంటింటికీ వెళ్తున్నారు. జగనన్న ప్రతినిధులుగా వచ్చిన వీరందరినీ.. తమ ఇంటికి బంధువులొచ్చినంత సంబరంగా ప్రజలు చిరునవ్వుతో ఆహ్వానించారు. కొన్ని ఊళ్లలో అయితే ఎంతో సంబరంగా, మేళతాళాలతో ఎదురేగి ఘన స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పట్టారు. గ్రామాలు మొదలు పట్టణాల వరకు ‘మా నమ్మకం నువ్వే జగన్’ నినాదం మార్మోగింది.వైయస్ జగన్ పాలనపై తమకు నమ్మకం ఉందన్నారు ప్రజలు. భవిష్యత్తులో కూడా మళ్లీ ఆయన పాలనే కావాలని, రావాలని ప్రజలు అంతా విశ్వసించడంతో పాటుగా ప్రభుత్వానికి మద్దతుగా వారి ఫోన్ల ద్వారా మిస్డ్ కాల్స్ ఇచ్చి కుటుంబాలు అన్నే పూర్తి స్థాయి మద్దతు తెలిపాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు ఈ కార్యక్రమానికి బ్రహ్మరథం పట్టారని వైసీపీ నేతలు తెలిపారు.
Read Also: Tammareddy Bharadwaja: అంత స్టార్ డమ్ ఉన్నవాడు.. ఇప్పుడు రోడ్లపై అలా తిరుగుతూ
ఏ ఇంటికి వెళ్లినా ఆత్మీయ పలకరింపులు, ప్రభుత్వ పనితీరుపై ఎవరిని కదిపినా హర్షాతిరేకాలు.. మళ్లీ జగనన్నే సీఎం కావాలన్నది తమ ఆకాంక్ష అంటున్నారు. వైయస్ జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ఇంటి తలుపు, మొబైల్ ఫోన్‌కు వైఎస్ జగన్ ఫొటోతో కూడిన స్టిక్కర్‌లను ఇష్టంగా అతికించుకున్నారు.82960 82960 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి మద్దతు తెలిపారు. ఆ వెంటనే ఐవీఆర్‌ఎస్ కాల్ ద్వారా సీఎం వైయస్ జగన్ సందేశం రావడంతో ఆనందపడ్డారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా లక్షల్లో మిస్ట్ కాల్స్ వచ్చాయంటే స్పందన ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు అని పార్టీ నేతలు చెబుతున్నారు.
ప్రజలందరికీ ఎంతో మేలు చేస్తున్న మన ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని, ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ప్రతిపక్షాలు, పగటివేషగాళ్లు లేనిపోని కల్లబొల్లి మాటలు, అబద్ధాలు, మాయ మాటలు చెపుతారని వాటిని ఏవీ నమ్మకుండా గొప్ప ప్రజాసంక్షేమ పాలనను కొనసాగిస్తున్న జగన్మోహన్ రెడ్డికి మీ అందరి మద్దతు ప్రకటించి బాసటగా నిలిచి మళ్లీ వచ్చే ఎన్నికల్లో ఆయనను సీఎంగా గెలిపించుకోవాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు కోరారు. ఇంత పెద్దస్థాయిలో ప్రజల మధ్యకు వెళ్ళి మద్దతు కూడగట్టుకున్న ప్రభుత్వం, పార్టీ లేదని కొనియాడారు. ఈ మెగా పీపుల్ సర్వేలో బాగంగా ప్రజా మద్దతు పుస్తకంలో పొందుపరిచిన ఐదు ప్రశ్నలను ఎంపీ, ఎమ్మెల్యే ఇరువురూ నేరుగా ప్రజలను అడిగి అవును అని సమాధానం చెప్పినట్లయితే బుక్ లో టిక్ మార్క్ పెట్టీ వారికి రసీదులు అందించారు. ప్రజలు మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్కు వైయస్ జగన్ అన్నతోనే సాధ్యం అని, మా నమ్మకం నువ్వే జగన్ అని నినదించారు. స్థానికుల అంగీకారంతో ఇంటి డోరుపై, గోడపై జగనన్నే మా భవిష్యత్తు అనే స్టికర్ ను, ఫోన్ పై స్టిక్కర్ను అతికించి వారితో కలిసి ఫోటోలు దిగారు.
శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ… కడప నుంచి కర్నూలు వరకూ ప్రతి నోట ఒకటే మాట. జగనే మా బాట అంటూ నినదిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు తెలియజేస్తూ, ప్రతి కుటుంబం అనుమతితో మా నమ్మకం నీవే జగనన్న స్టిక్కర్ను అతికించుకుంటూ ముందుకు సాగారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. రాబోయే ఎన్నికల్లో మా మద్దతు మీకే అని ప్రజలు ఘంటాపథంగా చెప్పారని వైసీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.
Read Also:Sabitha Indra Reddy: ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష