తిరుమల శ్రీవారి ఆలయంలో 5 నెలలుగా నిలిచిన సర్వదర్శనం సడెన్‌గా ఎలా ప్రారంభమైంది? టీటీడీ ప్రయోగాత్మక పరిశీలన కూడా పూర్తికాని.. సంప్రదాయ భోజన పథకం ఎందుకు ఆగిపోయింది? ఈ రెండు నిర్ణయాల వెనక ఉన్నది ఎవరు? టీటీడీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి?
తిరుమలలో ఆగమశాస్త్రానికే పెద్దపీట..!
కలియుగ వైకుంఠనాధుడి సన్నిధిలో చిన్నపాటి మార్పులు చేయాలంటే ఎన్నో అడ్డంకులు దాటాలి. మరేన్నో వివరణలు ఇచ్చుకోవాలి. అధికారులకు నచ్చిందనో.. పాలకమండలి మెచ్చిందనో.. ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుని అమలుచేసే పరిస్థితి శ్రీవారి ఆలయంలో ఉండదు. వెయ్యేళ్ల క్రితం రామానుజాచార్యులు నిర్దేశించిన విధంగా.. శ్రీవారి ఆలయంలో ఆగమశాస్ర్త ప్రకారం పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. భక్తుల సౌకర్యార్ధం పేరుతో కొన్నిసార్లు ఆగమశాస్ర్తాన్ని దాటి నిర్ణయాలు తీసుకున్నా.. మఠాధిపతులు, పీఠాధిపతులు నుంచి వచ్చిన వ్యతిరేకతతో వెనక్కి తగ్గక తప్పలేదు. శ్రీవారి ఆలయంలో నేత్ర ద్వారాలు.. భక్తులను తరలించేందుకు మెట్లమార్గం ఏర్పాటు .. స్వామివారి కళ్యాణోత్సవ సేవను ఆలయం వెలుపలికి తరలించేందుకు గతంలో తీసుకున్న నిర్ణయాలు ఆగమశాస్త్రానికి విరుద్ధంగా ఉండటంతో వెనక్కి తగ్గింది టీటీడీ.
కరోనా కారణంగా ఏప్రిల్‌లో సర్వదర్శనం ఆపేశారు!
సంప్రదాయ భోజనంపై ప్రయోగాత్మక పరిశీలన!
కరోనా కారణంగా తిరుమల ఆలయంలో దర్శనాలను నియంత్రించారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే సర్వదర్శనం క్యూ లైన్‌ను నిలిపివేసింది. ఇప్పుడు దేశంలో కరోన తీవ్రత తగ్గింది. విద్యాసంస్థలు తెరుచుకుంటున్నాయి. వ్యాపార, వాణిజ్య సంస్థలను ఓపెన్ చేశారు. అన్నీ పూర్వస్థితికి చేరుకుంటున్న తరుణంలో శ్రీవారి ఆలయంలో సర్వ దర్శనం ప్రారంభం కాలేదు. ఇదే అంశాన్ని భక్తులు పలుమార్లు టీటీడీ దృష్టికి తీసుకెళ్లినా.. ఇప్పట్లో సాధ్యం కాదనే సమాధానం వచ్చింది. ఇక గో ఆధారిత సాగుద్వారా పండించిన పదార్ధాలతో భక్తులకు సంప్రదాయ భోజనం అందించాలని ఆ మధ్య టీటీడీ నిర్ణయించింది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా సంప్రదాయ భోజనాన్ని కాస్ట్ టు కాస్ట్ ప్రాతిపదికన భక్తులకు అందించాలని భావించారు. ప్రయోగాత్మకంగా పరిశీలించారు కూడా. కానీ.. సంప్రదాయ భోజన కార్యక్రమం ఆగిపోయింది. ఇప్పట్లో సాధ్యం కాదన్న సర్వదర్శనం కూడా మొదలైంది. దీంతో ఈ రెండు కీలక నిర్ణయాల వెనక ఎవరు ఉన్నారు అని చర్చించుకుంటున్నారు.
సర్వదర్శనం ప్రారంభించాలని స్వామీజీ సూచన!
సంప్రదాయ భోజనం విక్రయం సరికాదన్న స్వామీజీ!
టీటీడీకి రెండోసారి ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన వైవీ సుబ్బారెడ్డి సతీ సమేతంగా వెళ్లి.. చాతుర్మాస దీక్షలో ఉన్న ఓ స్వామీజి ఆశీస్సులు తీసుకున్నారట. ఆ సందర్భంగా సామాన్య భక్తులకు కూడా స్వామి వారి దర్శన భాగ్యం కల్పించాలని.. సర్వదర్శనం ప్రారంభించాలని స్వామీజీ సూచించారట. ఆ సమయంలోనే సంప్రదాయ భోజనం ప్రస్తావన వచ్చినట్టు తెలుస్తోంది. సంప్రదాయ భోజనం పేరిట అన్న ప్రసాదాల విక్రయాలు మంచి సంప్రదాయం కాదని స్వామీజీ వారించారట. అలా స్వామీజీ చెప్పిన తర్వాతే తిరుమల కొండపై ఈ రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. సర్వదర్శనం ప్రారంభించడమే కాదు.. ఆన్‌లైన్‌లో టికెట్ల జారీకి చొరవ తీసుకుంటోంది టీటీడీ. ఇక విమర్శలకు ఆస్కారం ఇచ్చిన సంప్రదాయ భోజన విక్రయానికి స్వస్తి చెప్పింది. దీంతో టీటీడీ ఆలోచనలను ఒక్క మాటతో స్వామీజీ మార్చేశారని అనుకుంటున్నారట.
స్వామీజీ ఇతర సూచనలు పట్టాలెక్కబోతున్నాయా?
గతంలో గిరిజన, హరిజన ప్రాంతాల్లో టీటీడీ భజన మండళ్లు నిర్వహించేది. దానిని తిరిగి ప్రారంభించాలని కూడా స్వామీజీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సూచించారట. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని ఆలయాల కేంద్రాలుగా హిందూ ధర్మప్రచారం విస్తృతం చేయాలని కూడా హితవు పలికారట స్వామీజీ. త్వరలో ఇవి కూడా పట్టాలెక్కుతాయని కొండపై టాక్. మొత్తానికి ఒక్క మాట.. వచ్చిన మార్పులే తిరుమలలో చర్చగా మారాయి.