Site icon NTV Telugu

High Tension In Kuppam: కుప్పంలో టెన్షన్ టెన్షన్.. బాబు టూర్‌ ముందుకు సాగేనా..?

Kuppam

Kuppam

High Tension In Kuppam: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు పర్యటనకు సిద్ధం అయ్యారు చంద్రబాబు.. అయితే, ఆయన పర్యటనకు అడుగడునా ఆంక్షలు విధిస్తున్నారు పోలీసులు.. శాంతిపురం మండలంలో వందల మంది పోలీసుల మోహరించారు.. దీంతో, శాంతిపురం మండలం గడ్డురు క్రాస్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. టీడీపీ వాహన డ్రైవర్లపై పోలీసులు చేయి చేసుకోవడంతో టెన్షన్‌ వాతావరణం నెలకొంది.. పార్టీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు పోలీసులు. టీడీపీ ప్రచార రథం, సౌండ్ వాహనం పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు.. డ్రైవర్లు, సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.. పర్యటనలో సౌండ్ సిస్టమ్ కోసం అనుమతి కోరుతూ ఇప్పటికే టీడీపీ నేతలు పోలీసులకు లేఖలు కూడా ఇచ్చామని చెబుతున్నారు..

Read Also: Towel Inside Stomach: షాకింగ్ ఘటన.. మహిళ కడుపులో టవల్‌ను వదిలేసి కుట్లేశారు..!

మరోవైపు.. కెనామాకులపల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన స్టేజిని సైతం తొలగించారు పోలీసులు.. చంద్రబాబు పర్యటించే తొలి గ్రామంతో సహా మండలంలో అన్ని చోట్ల భారీగా పోలీసులు మోహరించారు.. ప్రతి గ్రామంలో, కూడళ్లలో పదుల సంఖ్యలో పోలీసు వాహనాలు, అదనపు బలగాలను దింపారు.. కాసేపట్లో బెంగుళూరు నుంచి 121- పెద్దూరు గ్రామం చేరుకోనున్నారు చంద్రబాబు నాయుడు. షెడ్యూల్‌ ప్రకారం ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు చంద్రబాబు.. అయితే, రోడ్లపై సభలు, ర్యాలీలను నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులతో.. ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ కొనసాగుతోంది.. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. జాతీయ, రాష్ట్ర, పంచాయతీ రాజ్, మున్సిపల్ రోడ్లపై సభలు, రోడ్‌షోలు, ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు తీసుకోనున్నారు.. అయితే, రోడ్లకు దూరంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే ప్రదేశాలు ఎంపిక చేయాలని ఆదేశాల్లో పేర్కొంది సర్కార్.. ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే సభలకు షరతులతో కూడిన అనుమతి ఇవ్వాలని స్పష్టం చేసింది.. ఇక, చంద్రబాబు పర్యటనలో అడుగడునా ఆంక్షలు కొనసాగుతున్నాయి.. మరి చంద్రబాబు ఎలా ముందుకు సాగుతారు? అనేది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version