NTV Telugu Site icon

LIVE UPDATES: తెలుగు రాష్ట్రాల్లో కుండపోత.. వరద పోటు

Heavy Rains ap and ts

D53d08a0 73c3 4543 910a 9352bcd42ea3

LIVE : భారీ వర్షాలు | Heavy Rains In Telugu States | Ntv

తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేని వానలతో తడిసి ముద్దయ్యాయి. పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. నిర్మల్ జిల్లా ముధోల్‌లో నిన్న ఒక్క రోజే 20.3 సెంటీమీటర్ల వాన కురిసింది. 24 గంటల వ్యవధిలో ఇంత భారీ స్థాయిలో వర్షపాతం నమోదు కావడం గత పదేళ్లలో ఇదే తొలిసారని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. 19 జులై 2013న రామగుండంలో 17.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సరికొత్త రికార్డుగా నమోదైంది.

నిర్మల్ జిల్లా భైంసా మండలం దేగాం వద్ద పెద్ద వంతెనపై వాగు పొంగడంతో భైంసా-బాసర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే, పలుచోట్ల రోడ్లు కోతకు గురికాగా, మరికొన్ని చోట్ల ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యుత్ స్తంభాలు, వృక్షాలు నేలకూలాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం లేదంటే అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, అదే జరిగితే మళ్లీ భారీ వర్షాలు తప్పవని అధికారులు తెలిపారు. చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఖమ్మం జిల్లాకు అధికారులు రెడ్ అలర్ట్ జారీచేశారు. కిన్నెరసాని పొంగిపొరలుతోంది. రాబోయే అయిదు రోజుల్లో గోదావరికి భారీ వరదలు వచ్చే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

ధవళేశ్వరం వద్ద గోదావరి పోటెత్తింది. 2.21 లక్షల క్యూసెక్కుల వరద జలాలు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. 13.63 అడుగులకు చేరింది బ్యారేజ్ నీటిమట్టం. 175 గేట్ల ద్వారా వరద జలాలు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలతో ధవళేశ్వరం వద్దకు వరద నీరు పోటెత్తుతోంది. గత కొన్నేళ్లలో లేనంతగా ఈఏడాది జూలైలోనే భారీ వరద రావడంతో లంక గ్రామాల వాసులు ఆందోళన చెందుతున్నారు. గోదావరికి ఆకస్మిక వరదల నేపథ్యంలో కంట్రోల్ రూంలు ఏర్పాటుచేశారు.

The liveblog has ended.
  • 10 Jul 2022 09:25 PM (IST)

    పరీక్షలు వాయిదా

    భారీ వర్షాల కారణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు పరీక్షలను వాయిదా వేసిన ఉస్మానియా యూనివర్సిటీ.. జూలై 11 నుంచి 13 వరకు జరిగే అన్ని పరీక్షలు వాయిదా.. అటు కాకతీయ, తెలంగాణ యూనివర్సిటీల పరిధిలోనూ వాయిదా పడిన పరీక్షలు

  • 10 Jul 2022 09:15 PM (IST)

    పలు జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం

    భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలకు ఐఏఎస్ అధికారులను తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లుగా నియమించింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు క్రిస్టినా చొంగ్తు.. సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు రోనాల్డ్ రాస్ స్పెషల్ ఆఫీసర్లుగా నియామకం అయ్యారు.

  • 10 Jul 2022 04:58 PM (IST)

    ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి

    హైదరాబాద్‌లో ఈరోజు రాత్రి, రేపు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని సీపీ సీవీ ఆనంద్ తెలియజేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలన్నారు. రాత్రి, పగలు పోలీసులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.

  • 10 Jul 2022 04:19 PM (IST)

    శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద

    నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 4.83 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 1084 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 90.3 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 64.677 టీఎంసీల నీరు నిల్వఉంది.

  • 10 Jul 2022 03:57 PM (IST)

    అల్పపీడనంతో పలుచోట్ల వర్షాలు

    ఒడిశా పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. దక్షిణ ఛత్తీస్ గఢ్ , ఉత్తర కోస్తాల్లో భారీ నుంచి అసాధారణ వర్షాలు పడతాయన్నారు. ఈనెల 12 లేదా 13న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు.

  • 10 Jul 2022 03:30 PM (IST)

    మూడు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు

    తెలంగాణలో భారీ వర్షాల కారణంగా రేపటి నుంచి మూడురోజుల పాటు ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించింది.

  • 10 Jul 2022 03:27 PM (IST)

    భద్రాచలంలో పెరిగిన నీటిమట్టం

    భద్రాచలంలో పెరుగుతున్న గోదావరి నీటి మట్టం. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు 34.8 అడుగులకు చేరిన గోదావరి నీటి మట్టం

  • 10 Jul 2022 02:11 PM (IST)

    నిండుకుండలా మల్లారెడ్డి చెరువు

    గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఆర్మూర్ పట్టణంలోని మల్లారెడ్డి చెరువు నిండుకుండలా మారింది. నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో చెరువుకు గండి కొట్టారు రెవెన్యూ అధికారులు. చెరువు సమీపంలోని ప్రాంతాల వారిని అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచించారు.

  • 10 Jul 2022 01:21 PM (IST)

    సంగారెడ్డిలో నీట మునిగిన శివాలయం

    సంగారెడ్డిలో శివాలయం మునిగిపోయింది. మహబూబ్ సాగర్ పూర్తిగా నిండటంతో ఆలయంలోకి చేరింది నీరు. చెరువు లోపలే ఉంది శివాలయం. భారీ వర్షాల కారణంగా వరద నీరు పెరిగింది.

  • 10 Jul 2022 01:18 PM (IST)

    కిన్నెరసానికి వరద

    భారీ వర్షాల కారణంగా కిన్నెరసాని ఉప్పొంగుతోంది. భద్రాద్రి జిల్లా గుండాల మండలంలో ఉధృతంగా ప్రవహిస్తుంది కిన్నెరసాని. మండలంలోని మోదుగుల గూడెం సజ్జల బోడు గ్రామాల మధ్య కిన్నెరసాని పై పూర్తి గాలేదు బ్రిడ్జి. దీంతో 5 గ్రామాలకు నిలిచి పోయాయి రాకపోకలు.

  • 10 Jul 2022 12:48 PM (IST)

    తెలంగాణ సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

    రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఆదేశాలు జారీచేశారు.

    అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.రాష్ట్రంలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నందున కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ, పశువులు, ఆస్తినష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు.

    కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ముఖ్య కార్యదర్శి ఆదేశించారు.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల నీటిపారుదల, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇంధన శాఖలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి.ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని ట్యాంకులు, చెరువులు, రిజర్వాయర్లు పొంగిపొర్లుతున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండి, ప్రమాదకర ట్యాంకులకు తెగితే ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచాలని చూడాలన్నారు.లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను అవసరమైతే ప్రత్యేక శిబిరాలకు తరలించాలి. రోడ్లకు ఏమైనా నష్టం జరిగితే వెంటనే మరమ్మతులు చేయాలన్నారు.

  • 10 Jul 2022 12:01 PM (IST)

    నిర్మల్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటన

    జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. కాటారం (మం) కురుస్తున్న భారీ వర్షాలకు వీరపూర్ చెరువు కట్ట తెగింది. దీంతో నీట మునిగాయి కట్ట కింద పొలాలు. ఆయుకట్ట రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఇటు నిర్మల్ పట్టణంలో వర్ష ప్రభావిత ప్రాంతంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు. ఎడతెరిపి లేని వర్షాల వల్ల శాంతి నగర్ చౌరస్తాలో రోడ్ పై నిలిచిన వర్షపు నీరు... పరిశీలించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డ్రైనేజీ లో ఎప్పటికప్పుడు పూడిక తీయాలని, రోడ్ లపై నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. భవిష్యత్ లో ఇలాంటీ పరిస్థితులు తలెత్తకుండా... పక్క ప్లానింగ్ తో ముందుకు వెళ్లాలని సూచించారు మంత్రి.

  • 10 Jul 2022 11:16 AM (IST)

    ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాలో వర్షాలు

    ఉమ్మడి మెదక్ , నిజామాబాద్ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడడంతో రోడ్లన్నీ చెరువుల్లా మారాయి. బస్టాండ్లలోకి నీరు చేరింది. గడిచిన 24 గంటల్లో మెదక్ జిల్లాలో 4.92 సెంటిమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మెదక్ మండలంలో 6.7 సెంటిమీటర్లు నమోదు అయిందని వాతావరణ శాఖ తెలిపింది. సంగారెడ్డి జిల్లాల్లో 4.5 సెం.మీ సగటు, అత్యధికంగా కల్హేర్ మండలంలో 6.6 సెం.మీ నమోదు అయింది. ఇటు నిజామాబాద్:బోధన్ డివిజన్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. గోదావరి నదికి పోటెత్తింది వరద నీరు. త్రివేణి సంగమం కందకుర్తి వద్ద నీటి మట్టం భారీగా పెరిగింది. శివాలయం నీట మునిగింది. ఏకాదశి కావడంతో శివాలయానికి వచ్చిన భక్తులు అవస్థలు పడ్డారు.

  • 10 Jul 2022 11:07 AM (IST)

    చేర్యాల బస్టాండ్ జలమయం

    సిద్దిపేట జిల్లా చేర్యాలలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఆర్టీసీ బస్టాండ్లోకి నీళ్లు రావడంతో ప్రయాణీకులు అవస్థలు అన్నీ ఇన్నీ కావు. రహదారులపై ఏర్పడిన గుంతల్లో వర్షం నీరు నిండిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

     

  • 10 Jul 2022 11:07 AM (IST)

    వరదల్లో కొట్టుకుపోయిన బియ్యం లారీ. డ్రైవర్ సేఫ్

    తెలంగాణలోనే కాదు పక్కన వున్న ఛత్తీస్ ఘడ్ లోనూ భారీవర్షాలు పడుతున్నాయి. బీజాపూర్ జిల్లాలో ప్రజాపంపిణీ వ్యవస్థకు చెందిన బియ్యం లారీ వరద నీటిలో కొట్టుకుపోయింది. భూపాలపల్లి పట్నం మెట్టుగూడ సమీపంలో పిడిఎస్ బియ్యంతో వెళ్తున్న లారీ వరదలలో కొట్టుకుపోయింది. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద వర్షాల వల్ల వాగులు పొంగి ప్రవహించాయి. కల్వర్టు మీద నీళ్లని చూసుకోకుండా డ్రైవరు వాహనాన్ని పోనివ్వడంతో లారీ నీటిలో దిగబడింది. కాసేపటికి వరద ప్రవాహం పెరగడంతో లారీ కొట్టుకుపోయింది. లారీ నుంచి దూకి డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు.

     

  • 10 Jul 2022 10:00 AM (IST)

    మూసీ ఉగ్రరూపం

    ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం బుగ్గవాగు పొంగడంతో డోర్నకల్ కారేపల్లి మధ్య రవాణా నిలిచిపోయింది. యాదాద్రి జిల్లా లో మూసీ ఉగ్రరూపం దాల్చింది. బీమలింగం కత్వా రోడ్డు లెవల్ బ్రిడ్జి మీద నుంచి మూసి వరద ప్రవహిస్తోంది. వరద నీరు బొల్లెపల్లి- సంగెo రహదారిపై మూసీ ప్రవాహం పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

  • 10 Jul 2022 09:38 AM (IST)

    గోదావరికి భారీ వరద.. కలెక్టర్ ఆదేశాలు

    భారీ వర్షాల ప్రభావం తెలంగాణ అంతటా కనిపిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 27 అడుగులుగా వుంది. శ్రీపాద ఎల్లంపల్లి, లక్ష్మీ బ్యారేజి భారీగా వస్తుండడం తో రాత్రి కి 43 అడుగులకు చేరనుంది గోదావరి నీటి మట్టం. దీంతో అధికారులు అలెర్ట్ గా ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశాలు జారీచేశారు. ఇటు నిజామాబాద్‌ లోని శ్రీరాం సాగర్ ప్రాజెక్టు వరద కాలువ నుంచి మిడ్ మానేరు డ్యాం కు నీటి విడుదల చేశారు. 5 వేల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేశారు అధికారులు. వరద కాలువ చుట్టు పక్క గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూరా వద్ద ఉధృతంగా ప్రవహిస్తోంది మంజీరా నది.

  • 10 Jul 2022 09:04 AM (IST)

    తెలుగు రాష్ట్రాల్లో భారీవర్షాలు.. రెడ్ అలర్ట్

     

  • 10 Jul 2022 08:55 AM (IST)

    నిజామాబాద్ లింగి తండాలో విషాదం

    భారీవర్షాలతో నిజమాబాద్ రూరల్ మండలం లింగి తండాలో విషాదం నెలకొంది. నెమలి కుంట అలుగు ఉధృతిలో ఇద్దరు పశువుల కాపరులు గల్లంతయ్యారు. పశువులను. అలుగు దాటించే క్రమంలో వరద ఉధృతి లో కొట్టుకుపోయాడు సాయిలు, ధారంగుల రెడ్డి. పోలీసులు, గ్రామస్థుల ఆధ్వర్యంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటివరకూ అతని ఆచూకీ లభించలేదు. ఇటు రాజన్నసిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలతో ఉదృతంగా ప్రవహిస్తుంది వేములవాడ రూరల్ మండలంలోని హన్మజిపేట నక్క వాగు. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పలు గ్రామాల ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. ఏకథాటిగా కురుస్తున్న వర్షాలతో రామగుండం సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులలో నిలిచిపోయింది బొగ్గు ఉత్పత్తి. రామగుండంలోని మూడు రీజియన్ లలో ఉన్న ఓసీ- 1, 2, 3, 5 ప్రాజెక్టు లలో సుమారు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. ఓపెన్ కాస్ట్ గనుల పని స్థలాలలో భారీగా చేరింది వరదనీరు. భారీ యంత్రాలు నిలిచిపోయాయి.

     

  • 10 Jul 2022 08:25 AM (IST)

    ఇసుక వాగు, లోతు వాగు తీవ్రరూపం.. ఆగిన రాకపోకలు

    భారీవర్షాలు భద్రాద్రి జిల్లాను వణికిస్తున్నాయి. అశ్వాపురం మండలంలో ఉధృతంగా ప్రవహిస్తుంది ఇసుక వాగు. దీంతో పాటు లోతు వాగు తీవ్రత పెరిగింది. దీంతో 16 గిరిజన గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలతో నిజాం సాగర్ ప్రాజెక్ట్ లోకి వరద నీరు వచ్చిచేరుతోంది. 5980 క్యూసెక్కుల వరదనీరు చేరిందని అధికారులు తెలిపారు. 1405 అడుగుల కు గాను 1392 అడుగుల నీటి మట్టం చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 17.802 టిఎంసి లు కాగా 5.474 టి ఎంసీలకు చేరింది. జిల్లావ్యాప్తంగా దంచికొడుతుంది వర్షం. భారీ వర్షాలతో కామారెడ్డిలో పొంగిపొర్లుతున్నాయి వాగులు, వంకలు. చెరువులు, కుంటలకు జలకళ సంతరించుకుంది. భారీ వర్షాలకు అలుగు పారుతున్న కామారెడ్డి పెద్ద చెరువు. పలుచోట్ల వాగుల ప్రవాహంతో నిలిచిపోయాయి రాకపోకలు. కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేశారు.

  • 10 Jul 2022 08:22 AM (IST)

    కాళేశ్వరం ప్రాజెక్ట్ కు వరద

    భూపాలపల్లిలోని కాళేశ్వరం ప్రాజెక్ట్ కు వరద కొనసాగుతోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ 65 గేట్లు ఎత్తివేశారు. ఇన్ ఫ్లో 4,93,540 ,ఔట్ ఫ్లో 5,54,660 క్యూసెక్కులు. బ్యారెజ్ సామర్థ్యం 16.17 టీఎంసీలు, ప్రస్తుతం 3.804 టీఎంసీలుగా వుంది. అన్నారం సరస్వతీ బ్యారేజ్ లో 50 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. ఇన్ ఫ్లో 2,03,500 ,ఔట్ ఫ్లో 2,25,000 క్యూసెక్కులుగా వుంది. నిజామాబాద్ - జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షంతో చెరువులు పొంగిపొర్లుతున్నాయి. నందిపేట, నవీపేటలో అత్యధికంగా 20 సెంటీమీటర్ల చొప్పన వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 800 చెరువులు నిండాయి. 24 మండలాల్లో సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదైంది. ఇందల్వాయి మండలం చిన్న వాగు పై తాత్కాలిక వంతెన తెగిపోయింది. దీంతో నాలుగు తండాలకు నిలిచి పోయాయి రాకపోకలు. వేల్పూర్ లో మోతె వాగు దగ్గర తాత్కాలిక రోడ్లు తెగిపోయాయి. నగరంలోని బ్యాంక్ కాలనీ, గూపన్ పల్లిలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు.

  • 10 Jul 2022 07:29 AM (IST)

    పొంగిపొర్లుతున్న పరిగి వాగు

    అతి భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. వికారాబాద్ జిల్లా పరిగిలో  రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి పొంగిపొర్లుతోంది పరిగి వాగు. ఈ వాగు ఉధృతంగా ప్రవహించడంతో వికారాబాద్ పరిగి కి రోడ్డు వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఈ ప్రాంతాల్లో ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.

  • 10 Jul 2022 07:26 AM (IST)

    48 గంటల్లో తెలంగాణలో అతి భారీ వర్షాలు

    రాబోయే 48 గంటల్లో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ రెడ్ అలెర్ట్ జారీ అయింది. ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు, భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, కొత్తగూడెంలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీచేసింది వాతావరణ శాఖ.