విశాఖ గర్జన గ్రాండ్ సక్సెస్ అయిందని, వర్షం పడుతున్నా విశాఖలో నిర్వహించిన ర్యాలీకి లక్షమందికి పైగా హాజరయ్యారని జేఏసీ ప్రకటించింది. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన ప్రజలు జై విశాఖ అని నినాదాలు చేశారు. 3 రాజధానులతోనే రాష్ట్రాభివృద్ధి అంటూ ప్రజా సంఘాల నినాదాలు మిన్నంటాయి. వికేంద్రీకరణే లక్ష్యంగా తమ గొంతు వినిపించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. తమ ఆకాంక్షలను బలంగా చాటేందుకు నడుం బిగించారు. దీనిలో భాగంగా శనివారం జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన ‘విశాఖ గర్జన’లో పాల్గొనడానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. విశాఖ గర్జనకు విశాఖ పరిపాలనా రాజధానిగా కోరుతూ భారీ ర్యాలీ చేపట్టారు. జోరువాన పడుతున్నా వివిధ వర్గాల ప్రజలు ఇందులో పాల్గొన్నారు.
ఈ ర్యాలీలో ప్రజలు, ప్రజా సంఘాలతో పాటు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జేఏసీ నేతలు, మేధావులు, విద్యావేత్తలు, ప్రొఫెసర్లు పాల్గొంటున్నారు. అంబేద్కర్ సర్కిల్ నుంచి పార్క్ హోటల్ వైఎస్సార్ విగ్రహం వరకూ ర్యాలీ కొనసాగుతోంది. రాజకీయాలకతీతంగా భారీ ప్రదర్శన చేపట్టగా దీనికి అన్ని వర్గాల నుంచి విశేషమైన మద్దతు లభిస్తోంది. ఈ మేరకు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని వివరిస్తూ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. తరతరాల వెనుకబాటు తనంపై ఒక్కటైన ఉత్తరాంధ్ర ప్రజానీకం వికేంద్రకరణతోనే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని నినదించారు. అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు స్పీకర్, సుబ్బారెడ్డి,మంత్రులు బొత్స,రజని,జోగిరమేష్,రోజా,నాగార్జున. అంబేద్కర్ సర్కిల్ నుంచి పార్క్ హోటల్ వైఎస్సార్ విగ్రహం వరకూ ర్యాలీ కొనసాగింది. ర్యాలీ పొడవునా అమరావతి వద్దు-మూడురాజధానులు ముద్దు అంటూ నినదించారు.
ఈ ర్యాలీలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటను రూపుమాపేందుకే విశాఖ రాజధాని అన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. ప్రజల ఆకాంక్షలకు అందరూ మద్దతు తెలుపుతున్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్ లక్ష్యం..ఆస్తుల సంపాదనే చంద్రబాబు ధ్యేయం.. ఆ నలుగురి అభివృద్ధే చంద్రబాబుకు కావాలి.. మహిళలను అడ్డుపెట్టుకుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడని నాని మండిపడ్డారు. తన మనుషులు కోసం చంద్రబాబు చూస్తారు. ఈ ప్రాంతం గురించి ఆలోచించరు. అమరావతి రాజదానిని గ్రాఫిక్స్ లో చూపించారు. విశాఖను అభివృద్ధి చేస్తే లక్షలమందికి మంచి ఉపాధి లభిస్తుంది. అమరావతి మాత్రమే కావాలనుకునేవారికి కుక్కకాటుకి చెప్పుదెబ్బలా ఆయా పత్రికలను, టీవీలను బహిష్కరించాలి. ఇంత వానలో విశాఖ గర్జనకు వచ్చిన వారికి ధన్యవాదాలు అన్నారు నాని.
Read Also: Weather Update: ఏపీలో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు
భారీ వానను లెక్కచేయలేదు… మూడు ప్రాంతాల అభివృద్ధికి జనం మద్దతు ఇచ్చారన్నారు స్పీకర్ తమ్మినేని వీరభద్రం. ఎంత జడివాన కురిసినా జనం లెక్కచేయలేదు. పాలనా పరమయిన వివక్ష. ఒకనాటి ఉద్యమాలకు పోరుగడ్డలు ఉత్తరాంధ్ర జిల్లాలు. ముక్తి కోసం, భుక్తి కోసం ఉద్యమాలు ఇక్కడ జరిగాయి. మహిళలు కూడా ఉద్యమం చేశారు. ఆనాడు ఎంతోమంది త్యాగం చేశారు. తాము పోయినా మన భావితరాలు బాగుపడాలన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు రాకూడదు. కర్నూలు, అమరావతి, విశాఖను డెవలప్ చేయాలని భావించారు జగన్. మూడు రాజధానులు చేస్తే సర్వతోముఖాభివృద్ధికి తీసుకున్న నిర్ణయం ఇది. మూడురాజధానులను వద్దనేవారిని కడిగేయాలి. వారిని నిలదీయాలన్నారు.
ఉత్తరాంధ్రది ఉక్కు సంకల్పం అని కొనియాడారు మంత్రి విడదల రజిని. ఉత్తరాంధ్ర ప్రజలు ఉగ్రరూపం దాల్చారు. విశాఖ గర్జన కోసం జనం ఉప్పెనలా వచ్చారు. ఉక్కు సంకల్పంతో జనం పోటెత్తారు. మూడురాజధానులకు మద్దతుగా నిలిచారు. విశాఖకు పాలనా రాజధాని కావాలని వారి మనోభావాలను తెలుసుకునేందుకు ఈ గర్జన నిర్వహించాం. అప్పుడు మద్రాస్, తర్వాత హైదరాబాద్ రాజధాని అంటే ఉత్తరాంధ్ర ప్రజలు ఓకే అన్నారు. ఇక్కడ రాజధాని రావాలని జనం భారీగా తరలివచ్చారు. రాలేని వారు టీవీల ముందు కూర్చున్నారు. మా వెనుకబాటు తనాన్ని పోగొట్టుకుంటామని మీరంతా వచ్చారు. ఈప్రాంతానికి మంచి జరగాలని జగన్ భావిస్తున్నారు. అమరావతి పేరుతో ఇక్కడికి వచ్చి ఏం సంకేతాలు ఇస్తారని రజని ప్రశ్నించారు.
అన్ని ప్రాంతాల అభివృద్దికి మూడు రాజధానులు అన్నారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. విశాఖ గర్జనలో పాల్గొన్నవారందరికీ నమస్కారాలు.. విశాఖ పాలనా రాజధానిగా ఉండాలని జగన్ భావించారు. అన్ని ప్రాంతాలు సర్వతోముఖాభివృద్ధి చెందాలన్నారు.అమరావతి లో కోట్ల రూపాయలు దోచుకోవాలని చంద్రబాబు అండ్ టీం భావించారు. ఎన్ని కుట్రలు చేసినా మూడురాజధానులు వచ్చి తీరతాయన్నారు. విశాఖలోనే పాలన సాగిస్తారు. పాదయాత్ర పేరుతో దండయాత్ర చేస్తున్న వారిని తరిమి తరిమి కొట్టాలి. వారిని నిలదీయాలి. మా ప్రాంతంలో పాలనా రాజధాని వస్తే ఎందుకు అడ్డుకుంటున్నారు. జేఏసీకి ధన్యవాదాలు తెలుపుతున్నా అన్నారు వైవీ సుబ్బారెడ్డి.