Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం

Venkaiah Naidu

Venkaiah Naidu

Venkaiah Naidu: గుంటూరులోని అమృత యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొని పట్టభద్రులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లినా, చివరికి స్వదేశానికి తిరిగి వచ్చి దేశాభివృద్ధికి సేవ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. చదువు కేవలం ఉద్యోగం కోసం కాకుండా మంచి సంస్కారాన్ని కూడా నేర్పాలని వెంకయ్య నాయుడు అన్నారు. తాను గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పలకతో చదువు ప్రారంభించానని గుర్తు చేసుకున్నారు. ప్రపంచంలోని అనేక దేశాల విద్యార్థులు ఒకప్పుడు భారతదేశంలోని నలందా, తక్షశిల వంటి విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించారని చెప్పారు.

కుటుంబ విలువలను కాపాడుకోవాలి
తల్లిదండ్రులతో సమయం గడపాలని, కుటుంబ వ్యవస్థకు భారత్ మూలస్థానమని పేర్కొన్నారు వెంకయ్య.. చిన్న వయసులోనే తన తల్లి మరణించగా, తన తాతయ్య, అమ్మమ్మ తనను పెంచారని, ప్రపంచ జ్ఞానాన్ని వారే నేర్పారని భావోద్వేగంగా గుర్తు చేసుకున్నారు. ఇక, విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్నానని వెంకయ్య నాయుడు తెలిపారు. అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) సమయంలో 17 నెలలు జైలులో ఉన్నానని, 1983లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని చెప్పారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో 30 ఏళ్లు ప్రతిపక్షంలోనే పనిచేశానని, రాజకీయాల్లో ఉన్న సమయంలో వ్యక్తిగతంగా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని పేర్కొన్నారు. ఒకప్పుడు అటల్ బిహారీ వాజ్‌పేయి పేరు గోడలపై రాసిన తాను, తర్వాత ఆయనతో కలిసి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఒకే వేదికపై కూర్చోవడం జీవితంలో మరపురాని అనుభవమని చెప్పారు.

యువతకు ప్రేరణాత్మక సందేశం
“ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు” అని విద్యార్థులకు సూచించిన వెంకయ్య నాయుడు, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రకృతిని ప్రేమించాలని, ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు. ఇక, “నేను పదవికి రిటైర్ అయ్యాను గానీ, పెదవికి రిటైర్ కాలేదు” అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించిన ఆయన, ప్రపంచంలో భారత్ శక్తివంతమైన దేశంగా ఎదుగుతోందని, విశ్వగురువుగా నిలిచే సామర్థ్యం భారత్‌కు ఉందని అన్నారు. దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమని, ప్రతి యువకుడు దేశ పురోగతికి తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు..