ఏపీ లోకల్ బాడీ ఎన్నికల్లో విచిత్ర పరిణామాలు జరుగుతున్నాయని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులో ఆయన మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో అవాంఛనీయ సంఘటనలు 19 చోట్ల జరిగాయన్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాత్కాలికంగా ఎన్నికలను నిలిపివేశారని.. మొత్తం స్థానాల్లో నిలుపుదల చేయలేదన్నారు. సుప్రీంకోర్టు స్పందించడం వల్లే ఎన్నికల కమీషన్, పోలీసులు తమ వైఖరి మార్చుకున్నారని తెలిపారు. ప్రజల్లో కూటమి పట్ల వ్యతిరేకత పెరిగి.. వైసీపీకి అనుకూలత పెరిగిందన్నారు. అందుకే చంద్రబాబు అరాచకాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.
సాయికృష్ణ లాకప్ డెత్ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే రూ. 25 లక్షల నష్టపరిహారం ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు తమ తప్పులను సరిచేసుకోవాలని సూచించారు. తప్పులు చేసిన ఏ అధికారినీ వైసీపీ ప్రభుత్వం వదిలిపెట్టదని.. కోర్టు ముందు నిలబెడుతుందన్నారు. ఎన్నో చోట్ల నామినేషన్లు వేయకుండా పోలీసులను అడ్డుపెట్టుకుని కూటమి నాయకులు బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు. గుంటూరులో నామినేషన్ల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగిందన్నారు. రెండున్నర ఏళ్లలో కూటమి ప్రభుత్వం కూలిపోతుందని.. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
గుంటూరులో 76 స్థానాల్లో వైసీపీ పోటీ చేస్తుందని తెలిపారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. జిల్లా పరిషత్, ఎంపీటీసీ ఎన్నికల్లో నామినేషన్లు వేయనీయకుండా పల్నాడులో వైసీపీ అభ్యర్థులను కిడ్నాప్ చేస్తున్నారని.. దీనిపై కూడా వైసీపీ కోర్టును ఆశ్రయిస్తుందని చెప్పారు. వ్యవస్తలన్నీ చంద్రబాబు గుప్పెట్లో పెట్టుకుని గెలుపొందాలని చూస్తున్నారని ఆరోపించారు.

