Site icon NTV Telugu

Andhra Pradesh: ప్రభుత్వానికి ఉద్యోగుల హెచ్చరిక.. సంక్రాంతి తర్వాత ప్రత్యక్ష ఆందోళనలు

Bopparaju Venkateswarlu

Bopparaju Venkateswarlu

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగులు అల్టీమేటం జారీ చేశారు. సంక్రాంతిలోగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని ఏపీ అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. రావాల్సిన బకాయిలు అడుగుతామనే సకాలంలో జీతాలు ఇవ్వకుండా ఆందోళన సృష్టిస్తున్నారని ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతభత్యాల చెల్లింపు, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై సీఎం జగన్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులతో సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించాలని కోరారు.

Read Also: Vishal Marriage : ప్రభాస్ పెళ్లి తర్వాతే తను చేసుకుంటానన్న విశాల్

గతంలో మూడు నెలలకు ఒకసారి సమావేశం నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పిందని బొప్పరాజు వెంకటేశ్వర్లు గుర్తుచేశారు. అయితే ఇప్పుడు ఆ మాటను అటక ఎక్కించారని ఆరోపించారు. ఉద్యోగుల బకాయిలను ఏప్రిల్ 30లోపు చెల్లిస్తామని జనవరిలో జరిగిన చర్చల్లో చెప్పారని.. కానీ ఇప్పటివరకు బకాయిలు చెల్లించకపోగా జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదని మండిపడ్డారు. జూన్ 30 లోపు సీపీఎస్ రద్దు, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేస్తామని హామీ ఇచ్చినా అమలు కాలేదన్నారు. పీఆర్సీ బకాయిలు ఇంతవరకు ఇవ్వలేదన్నారు. 2018 జూలై 30 నుంచి డీఏలు ఇవ్వకుండానే ఆదాయపు పన్నును కూడా మినహాయించారని తెలిపారు. పెన్షనర్లకు కూడా ఇలాగే చేశారన్నారు. సీపీఎస్‌ను రద్దు చేయకుండా ఎందుకు ఇన్నిసార్లు సమావేశాలు నిర్వహిస్తున్నారని బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు.

Exit mobile version