NTV Telugu Site icon

Vangalapudi Anitha: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ మా ప్రభుత్వ లక్ష్యం..

Anitha

Anitha

Vangalapudi Anitha: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ మా ప్రభుత్వ లక్ష్యం అని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ప్రతి జిల్లాలో ఒక ‘నార్కోటిక్ కంట్రోల్ సెల్’ ఏర్పాటు చేస్తామన్నారు. మాదక ద్రవ్య కేసులను ఛేదించే విధంగా పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాం.. ‘స్టేట్ టాస్క్ ఫోర్స్’ విభాగం ద్వారా నిఘా వ్యవస్థను పెంచుతాం అన్నారు. టెక్నాలజీ ద్వారా గంజాయి సాగు, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం.. డ్రోన్లు, శాటిలైట్లు, జీపీఎస్ ట్రాకింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఏఐ ఆధారిత సీసీటీవీల వినియోగంతో డ్రగ్స్ ను నివారిస్తాం అని ఆమె పేర్కొన్నారు. వ్యూహాత్మక చెక్ పోస్టులు, హాట్ స్పాట్ లు, ప్రత్యేక ఎన్డీపీఎస్ బీట్ల ద్వారా గంజాయి స్మగ్లింగ్ అరికడతాం.. టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి గంజాయి ఆచూకీ చెప్పి పట్టిస్తే ప్రభుత్వం తరపున రివార్డులు అందిస్తామన్నారు. వీధులను, విద్యా సంస్థలను కమ్మేసిన గంజాయి రక్కసిని అంతం చేస్తామని మంత్రి అనిత చెప్పారు.

Read Also: Israel: ఇజ్రాయెల్ చరిత్రలో మరో మైలురాయి.. 10 ఏళ్ల క్రితం కిడ్నాపైన మహిళను రక్షించిన ఐడీఎఫ్

ఇక, సోషల్ మీడియా వేదికల ద్వారా యువత డ్రగ్స్ బారిన పడకుండా అవగాహన కల్పిస్తామని హోంమంత్రి అనిత చెప్పారు. గంజాయి రవాణా జరిగే చోట్ల పటిష్ట నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తాం.. మందు, డ్రగ్స్ వల్ల గతంలో కన్నా గత ప్రభుత్వంలో రెట్టింపైన ఆత్మహత్యలు.. సైబర్ ఇంటెలిజెన్స్ ద్వారా డ్రగ్ నెట్ వర్క్ లను ప్రక్షాళన చేస్తామన్నారు. సచివాలయంలో గంజాయి నివారణ, కట్టడి చర్యలపై బుధవారం జరిగిన మంత్రివర్గ ఉపసంఘం భేటీలో చర్చ జరిగినట్లు మంత్రి తెలిపారు. గంజాయి నివారణకు తీసుకుంటున్న చర్యలు మరింత పటిష్టం చేసే అంశంపై చర్చ కొనసాగింది. ఎన్ఆర్ సీబీ-2020 లెక్కల ప్రకారం దేశంలో డ్రగ్స్, ఆల్కహాల్ తీసుకుని ఆత్మహత్య చేసుకునే వారి సంఖ్యలో 5వ రాష్ట్రంగా ఏపీ ఉంది.. గంజాయికి యువత బానిసవ్వకుండా చేయడంలో ఏపీ పౌరుల భాగస్వామ్యం కూడా అవసరం.. గిరిజన యువతకు గంజాయి సరఫరా చేస్తున్న నిందితులను పట్టుకునే చర్యలపై చర్చిస్తున్నామని వంగలపూడి అనిత వెల్లడించారు.