NTV Telugu Site icon

Dowleshwaram Barrage: ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మళ్లీ రెండో ప్రమాద హెచ్చరిక జారీ

Dowleshwaram

Dowleshwaram

Dowleshwaram Barrage: గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద గోదావరి వరద ప్రవాహం తగ్గుతూ మళ్లీ పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మళ్లీ రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. రెండు రోజులుగా తగ్గు ముఖం పట్టిన గోదావరి వరద ఉధృతి మళ్లీ క్రమేపీ పెరుగుతుంది. ప్రస్తుతం బ్యారేజీ వద్ద నీటిమట్టం 13.75 అడుగులకు నీటిమట్టం పెరగడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీ నుండి సుమారు 13 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

Read Also: Deputy CM Pawan Kalyan: ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వయంగా పరిశీలిస్తున్న పవన్‌ కల్యాణ్..

గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ముఖ్యంగా, భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. రాష్ట్రంతో పాటుగా పైనుంచి వరద నీరు వస్తుండటంతో నీటి ప్రవాహం అంతకంతకూ పెరుగుతుంది. అప్రమత్తమైన అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ముందస్తు హెచ్చరికలను జారీ చేస్తూ, లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మళ్లీ పెరిగింది. శుక్రవారం రాత్రి వరకు తగ్గుముఖం పట్టిన వరద ప్రవాహం.. తెల్లారే సరికి ఒక్కసారిగా పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో పాటుగా, రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద నీటిమట్టం పెరుగుతుందని అధికారులు తెలిపారు. భద్రాచలం వద్ద మధ్యాహ్నం 3 గంటలక నీటి మట్టం 52.8 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53 అడుగులకు పెరిగితే అధికారులు చివరి మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. శుక్రవారం రాత్రి 9 గంటలకు గోదావరి నీటిమట్టం 48 అడుగులు దాటి ప్రవహించటంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

భద్రాచలం, ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండడంతో వరద నీటిలోకి ప్రవేశించవద్దని అధికారులు సూచించారు. కాలువలు, కల్వర్టులకు దూరంగా ఉండాలని.. పడిపోయిన విద్యుత్ లైన్లకు,స్తంభాలకు దూరంగా ఉండాలని సూచనలు చేశారు. అధికారులకు సహకరించాలని కోరారు.