మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకే మాల్ ఇప్పిస్తామన్నారు. కొన్ని వస్తువులు అయితే మార్కెట్ రేటు కంటే నలభైశాతం తక్కువకే ఇస్తామని మాయమాటలు చెప్పారు. అందరినీ నమ్మించేందుకు రెండు మూడు నెలలు చెప్పినట్లే చేసి తర్వాత కోట్ల రూపాయలు వసూలు చేశారు. డబ్బులు ఇవ్వమంటే అడ్డం తిరగడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
గుంటూరు ఏటీ అగ్రహారానికి చెందిన పడుచూరి రమ్య, దిలీప్ లు గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో మోసాలకు తెరతీశారు. తెలిసిన వారితో పెట్టుబడురు పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించారు. ఏ వస్తువైనా మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకు వస్తుందని నమ్మించారు. నిత్యావసర వస్తువులు మార్కెట్ రేటు కంటే పది శాతం తక్కువ ధరకు ఇప్పిస్తామని చెప్పారు. బైకులు, హోం నీడ్స్ అయితే మరింత తక్కువ ధరకు వస్తాయని చెప్పారు. తెలిసినవాళ్లు కావడంతో ఇద్దరి మాటలు నమ్మారు. మొదట రెండు, మూడు సార్లు చెప్పినట్లే తక్కువ ధరకు వస్తువులు అందించారు. దీంతో వారిపై అందరికీ నమ్మకం కుదిరింది. కంపెనీలో పెట్టుబడులు పెడితే మరింత లాభం వస్తుందని నమ్మించారు.
లాభంతో పనిలేదనుకుంటే పదిరూపాయల వడ్డీ ఇస్తామని చెప్పారు. లాభాలు భారీగా వస్తాయని అందరూ ఆశపడ్డారు. ఇలా దాదాపు 50మంది రెండున్నర కోట్లు చెల్లించారు. తర్వాత సరుకు డెలివరీ చెయ్యకపోవడమే కాకుండా డబ్బులు అడిగితే మొహం చాటేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో దిలీప్ తండ్రి తాను పదిహేను రోజుల్లో డబ్బులు చెల్లిస్తామని చెప్పాడని బాధితులు చెబుతున్నారు. పదిహేను రోజులు గడిచిన తర్వాత డబ్బులు ఇచ్చేది లేదని, మీకు చైతనైది చేసుకోండంటూ బెదిరిస్తున్నాడని బాధితులు వాపోతున్నారు. తాను నాలుగు లక్షలు ఇచ్చానని, తిరిగి డబ్బులు అడుగుతుంటే పట్టించుకోవడం లేదంటున్నాడు.
కిరణా వ్యాపారి అనిల్ కుమార్ అయితే 27లక్షలు కట్టి మోసపోయాడు. నిత్యావసర సరుకులు మార్కెట్ రేటు కంటే తక్కువకు ఇస్తానంటే తాను నమ్మానని చెబుతున్నాడు. మొదట్లో తక్కువ ధరకే సరుకులు ఇవ్వడంతో తాను అప్పులు తీసుకొచ్చి 27లక్షలు చెల్లించానని చెబుతున్నాడు. ఇప్పుడు సరుకులు ఇవ్వలేదని, డబ్బులు అడిగితే పట్టించుకోవడం లేదని వాపోతున్నాడు. భారీగా ఆదాయం వస్తుందని బంగారం తాకట్టుపెట్టి పదిన్నర లక్షలు ఇస్తే తనను మోసం చేశారని మరో బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది. చిన్నప్పటినుంచి తెలిసినవారు కావడంతో నమ్మి డబ్బులు ఇచ్చామని, ఇలా మోసం చేస్తారని అనుకోలేదంటున్నారు. మార్కెట్ కంటే తక్కువ ధరకే వస్తువులు, సరుకులు ఇప్పిస్తానంటూ మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
