Andhra Pradesh: రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిలపడిపోయింది. ఆ పార్టీని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క సీటును కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేకపోయింది. 2024 ఎన్నికల్లోనూ ఆ పార్టీ పుంజుకుంటుందన్న ఆశలు లేవు. ఈ నేపథ్యంలో ఏపీలోని కాంగ్రెస్ పార్టీకి అధిష్టానం నూతన సారథిని నియమించింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (PCC) నూతన అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి కాంగ్రెస్ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also: విదేశాల్లో ఉన్న 10 దేవతామూర్తులు
అటు 18 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. 34 మందితో కో ఆర్డినేషన్ కమిటీని నియమించింది. అంతేకాకుండా నూతన వర్కింగ్ ప్రెసిడెంట్లను కూడా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. మస్తాన్ వలి, జంగా గౌతమ్, రాకేశ్, సుంకర పద్మశ్రీలను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించింది. మాజీ కేంద్రమంత్రి పల్లంరాజుకు ప్రోగ్రాంల కమిటీ ఛైర్మన్ బాధ్యతలను అప్పగించింది. తులసిరెడ్డిని మీడియా కమిటీ ఛైర్మన్‌గా నియమించింది. మాజీ ఎంపీ హర్షకుమార్‌ను ప్రచార కమిటీ ఛైర్మన్‌గా నియమిస్తున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం వెల్లడించింది. ఈ మేరకు పార్టీ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
