Sake Sailajanath: ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సాకే శైలజానాథ్ ఈరోజు (ఫిబ్రవరి 7) వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు. గతేడాది డిసెంబర్ నుంచి ఆయన పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం జరిగినప్పటికి.. ఇవాళ ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరుతున్నారు. ఆయన వెంట పలువురు అనుచరులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. శైలజానాథ్ వైసీపీలో చేరిన తర్వాత జగన్ బెంగుళూరు వెళ్లనున్నారు.
Read Also: Antarvedi: నేడు అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దివ్య కళ్యాణం
అయితే, సాకే శైలజానాథ్ అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తి. ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. కాగా, శైలజానాథ్ శింగనమల నియోజకవర్గం నుంచి 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పని చేసిన అనుభవం కూడా ఉంది ఆయనకి. ఇక, రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నప్పటికి ఆయన పార్టీలో కొనసాగారు. 2022లో ఆంధ్రప్రదేశ్ ఏపీసీసీ అధ్యక్షుడిగా కూడా విధులు నిర్వహించారు. ఇక, 2024 ఎన్నికలకు ముందు శైలజానాథ్ తెలుగు దేశంలోకి వెళ్తున్నారని ప్రచారం జరిగింది. మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డిని కలవడంతో చేరిక ఖాయం అన్నారు.. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో ఎక్కడా పెద్దగా యాక్టివ్‌గా కనిపించలేదు.. చివరకు ఈరోజు వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నారు.