ఆంధ్రా రాజకీయాల్లో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి తీరు హాట్ టాపిక్ అవుతుండేది. రాష్ట్ర విభజన తర్వాత ఎన్నికల సర్వేలతో ఆయన కాకరేపారు. ఆయన భాష్యాలు, సర్వేలు తప్పవడంతో ఆయన బొక్కబోర్లా పడ్డారు. తాజాగా మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు మాజీ ఎంపీ లగడపాటి. తాజాగా ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్‌తో లగడపాటి సమావేశం.. రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. శని, ఆదివారాల్లో బిజీగా గడిపారు లగడపాటి. పలువురు కాంగ్రెస్, వైసీపీ నాయకులతో సమావేశం నిర్వహించడంతో ఆయన తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. లగడపాటి తనయుడు త్వరలో రాజకీయాల్లోకి వస్తాడనే ప్రచారం సాగుతోంది.
మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ శని, ఆదివారాల్లో ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రాంతంలో పర్యటించి పలువురు రాజకీయ నాయకులను కలుస్తూ బిజీబిజీగా గడిపారు. దీంతో తిరిగి ఆయన రాజకీయాల్లో యాక్టివ్ కాబోతున్నారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్‌తోపాటు వైసీపీ, కాంగ్రెస్ నేతలతోనూ లగడపాటి ఆంతరంగిక భేటీ నిర్వహించారు. శనివారం రాత్రి చందర్లపాడులో నందిగామ మార్కెట్ యార్డ్ చైర్మన్ వెలగపూడి వెంకటేశ్వరరావు కుమారుడి వివాహ రిసెప్షన్‌కు లగడపాటి హాజరయ్యారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ హాజరయ్యారు. ఆ రాత్రి నందిగామలోని స్థానిక మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పాలేటి సతీష్ ఇంట్లో బసచేశారు. అక్కడ తాజా రాజకీయ అంశాలతో పాటు అనేక విషయాలు చర్చించినట్టు తెలుస్తోంది.
అంతేకాదు, ఆదివారం నందిగామ, జగయ్యపేట నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్, వైసీపీ నాయకులను లగడపాటి కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల మృతి చెందిన వైసీపీ నాయకుడు మంగూలరి కోటిరెడ్డి చిత్రానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఐతవరంలో మాజీ హోంమంత్రి, మైలవరం ఎమ్మెల్యే తండ్రి వసంత నాగేశ్వరరావును కలిశారు. రాజకీయ నాయకులతో వరుస సమావేశాల నేపథ్యంలో లగడపాటి మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారన్న వార్తలు ఊపందుకుంటున్నాయి. ఇదే విషయాన్ని విలేకరులు ఆయన వద్ద ప్రశ్నిస్తే.. అలాంటిదేమీ లేదని లగడపాటి తేల్చి చెప్పారు. కానీ ఏదో జరుగుతోందన్న గుసగుసలు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.
Read Also: Mahesh Babu : దుబాయ్ ట్రిప్ వెనుక అసలు ప్లాన్ ఇదా?