NTV Telugu Site icon

Andhra Pradesh: 2034లో చనిపోతా.. మరణ వేడుకలకు రావాలని మాజీ మంత్రి ఆహ్వానం

Paleti Rama Rao Invitation

Paleti Rama Rao Invitation

Death Celebrations Invitation: సాధారణంగా ఎవరైనా పెళ్లికి లేదా గృహ ప్రవేశానికి లేదా పుట్టినరోజు వేడుకలకు శుభలేఖలు ముద్రించి బంధుమిత్రులకు పంపిణీ చేస్తుంటారు. కానీ ఎవరైనా మరణాన్ని ముందుగా అంచనా వేసి వేడుకలకు రావాలంటూ ఆహ్వానం పంపించడం చూశారా. కానీ ఏపీలోని ఓ మాజీ మంత్రి మాత్రం తన మరణవేడుకలకు రావాలని ఆహ్వాన పత్రికలను పంచుతున్నారు. తన మరణదిన వేడుకలను ఘనంగా చేసుకుంటున్నానని, అందరూ తప్పకుండా రావాలని ఆహ్వాన పత్రిక ఇస్తుంటే అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. మాజీ మంత్రి పాలేటి రామారావు తన మరణ వేడుకలపై ఆహ్వాన పత్రికలను పంపిణీ చేస్తున్నారు. ఈ మేరకు చీరాల ఐఎంఏ హాలులో శనివారం ఉదయం 10 గంటలకు జరిగే వేడుకలకు హాజరవ్వాలని అభిమానులను కోరారు. ‘ఏటా జరుపుకునే పుట్టినరోజు వేడుకలు అర్థరహితమని తెలుసుకున్నా.. అందుకే ఇకపై మరణదిన వేడుకలు జరుపుకోవాలని భావిస్తున్నా. ఇన్నాళ్ల నా జీవితాన్ని పరిశీలించుకున్నాక నా మరణ సంవత్సరాన్ని 2034గా నిర్ణయించుకున్నా. దానికి ఇంకా 12 సంవత్సరాలు ఉంది. ఇప్పటి నుంచి ప్రతీ సంవత్సరం మరణదిన వేడుకలు జరుపుకుంటాను. ఆ వేడుకలకు మీరు హాజరై, నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నా’ అంటూ రామారావు ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం మాజీ మంత్రి లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాకుండా ఏపీ రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

Read Also: CNG Price: మళ్లీ పెరిగిన సీఎన్‌జీ ధర.. అదనపు బాదుడు షురూ

పుట్టిన ప్రతీ ఒక్కరికీ మరణం తప్పదని, బతికి ఉన్నంత కాలం ఇతరులకు వీలైనంత సాయం చేయాలే తప్ప అపకారం చేయొద్దని రామారావు చెప్పారు. ఈ విషయం గుర్తెరిగి తాను ఎంతకాలం జీవించాలని అనుకుంటున్నాడో ఆలోచించి, మరణానికి ఓ తేదీని నిర్ణయించుకుని ఏటా మరణదిన వేడుకలు జరుపుకోవాలని సూచించారు. భగవంతుడు ఎంత బోధించినా మనిషి తన జీవన విధానాన్ని, ఆలోచనను పూర్తిగా సరిచేసుకోవడంలేదని అన్నారు.