Eluru Hospital: ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఏలూరు ప్రభుత్వాసుపత్రి మార్చురిలో ఉన్న ఓ అనాధ మృత దేహాన్ని ఈ నెల 8వ తేదీ అర్ధరాత్రి సమయంలో మాయం చేసేందుకు మార్చురీ అసిస్టెంట్ ప్రయత్నించాడు. ఆ విషయాన్ని గమనించిన మహిళా ఉద్యోగి.. అతన్ని అడ్డుకోవడంతో మృతదేహం తరలింపు నిలిచిపోయింది. అనాధ మృతదేహాన్ని మెడికల్ కాలేజీలకు అమ్మడానికి తీసుకువెళుతున్నారు అంటూ ఆరోపణలు వెల్లువెత్తడంతో విషయాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది గోప్యంగా ఉంచారు. అయితే, సమాచారం అందుకున్న ఫోరెన్సిక్ హెచ్‌వోడీ.. రాతపూర్వకంగా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శశిధర్ కు ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశించారు. అయితే, ఆసుపత్రి మార్చురి నుంచి ఆ మృతదేహాన్ని తరలించేందుకు ఎందుకు ప్రయత్నం జరిగింది..? దీని వెనుక ఎవరి హస్తం ఉంది అనే కోణంలో ఆరా తీస్తున్నారు.. అయితే, ఎవరికి అనుమానం రాదు.. అడిగేవారు ఉండరు గనుక.. అనాధ మృత దేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నాలు జరిగినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. ఇక, గతంలోనే ఇలాంటి ఘటనలు ఏమైనా చోటు చేసుకున్నాయా? అని అనుమానించేవారు లేకపోలేదు.