CM Chandrababu: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంకి ఏపీ సీఎం చంద్రబాబు చేరుకుని ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అనంతరం పోలవరం నిర్వాసితులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్లలో 33సార్లు పోలవరం వచ్చి ప్రాజెక్టు పూర్తి చేయడం, పునరావాస కల్పనపై దృష్టి పెట్టామని పేర్కొన్నారు. కానీ, పోలవరం నిర్వాసితులను గత ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. నిర్వాసితులకు రూ. 10 లక్షలు ఇస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చి మాట తప్పింది.. టీడీపీ ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే 2020 కంతా పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం కూడా పెరిగింది.. పోలవరం కోసం తెలంగాణలో ఉన్న 7 మండలాలను ఏపీలో విలీనం చేశామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Read Also: Devadula Project: ఎట్టకేలకు ప్రారంభమైన దేవాదుల మూడోదశ మోటార్లు.. ఆనందం వ్యక్తం చేసిన రైతులు!
అయితే, జగన్ పాలనలో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది.. జగన్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల వందల కోట్ల ప్రజాధానం వృధా అయిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. అలాగే, గత ప్రభుత్వంలో పోలవరానికి వచ్చిన డబ్బులు దారి మళ్లించారు.. దాని వల్ల నిర్వాసితులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఇక, ప్రాజెక్ట్ కోసం భూములు ఇచ్చి అనేక ఇబ్బందులు పడ్డారు.. 2027నాటికి పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.. పునరావాసం పూర్తయ్యాకనే.. ప్రాజెక్టు నీళ్లు వదిలి పెడతాం.. నిర్వాసితుల ఆదాయం పెరిగే మార్గాలను కూడా కల్పిస్తామన్నారు. నిర్వాసితులు ఇతరుల మాటలు విని మోసపోవద్దు అని సూచించారు. అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉంటేనే కేంద్రం పునరావాసం నిధులు ఇస్తుంది.. దళారులు, మధ్యవర్తులు, దొంగలు లేకుండా నిర్వాసితుల ఖాతాల్లో డబ్బులు వేసిన ఘనత ఎన్డీయే ప్రభుత్వానికి దక్కుతుందని చంద్రబాబు వెల్లడించారు.