Dwaraka Tirumala: ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల చిన వెంకన్న కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమెతుడైన ఆ శ్రీనివాసునీ కళ్యాణాన్ని తిలకించిన భక్తులు ఆనంద పారవశ్యంలో మునిగితేలారు. స్వామివారి వివాహ మహోత్సవానికి ఆలయ తూర్పు రాజగోపురం ముందర అనివేటి మండపంలో ప్రత్యేక కల్యాణ మండపాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా స్వామి, అమ్మవార్లను వేర్వేరు వాహనాల్లో కళ్యాణ మండపానికి తీసుకువెళ్లారు. అక్కడ అర్చకులు స్వామి, అమ్మవార్ల కళ్యాణమూర్తులను ప్రత్యేక పూలతో అలంకరించారు. స్వామి అమ్మవార్లకు ఆలయ చైర్మన్ ఎస్‌వీ సుధాకర్ రావు, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పట్టు వస్త్రాలు సమర్పించారు. శుభ ముహూర్త సమయాన మంగళ వాయిద్యాలు, మేళ తాళాల నడుమ.. వేదమంత్రాల సాక్షిగా అర్చకులు జీలకర్ర బెల్లం పూర్తి చేశారు. అనంతరం స్వామివారి కల్యాణ మహోత్సవo అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఎస్‌వీ సుధాకర్ రావు, ఈవో, భక్తుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను, తలంబ్రాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు.
Read Also: IMD Weather: వెదర్ రిపోర్ట్.. తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు..
కోనసీమ వాసులు చిన్న తిరుమలగా పిలిచే.. ద్వారకా తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఈ నెల 13వ తేదీన ప్రారంభం అయ్యాయి.. ఎనిమిది రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తూనే ఉన్నారు. ఈ నెల 20వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కాగా, ద్వారకా తిరుమలలో ఏడాదిలో రెండు సార్లు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఒకసారి వైశాఖమాసంలో, మరోసారి అశ్వయుజ మాసంలో స్వామివారికి వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుపుతారు. 17న స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం జరగగా.. ఈ రోజు ద్వారకా తిరుమలలోని మాఢ వీధుల్లో స్వామివారి రథోత్సవం నిర్వహిస్తారు.