CM Chandrababu: రాష్ట్రంలో వైసీపీ ఒక బాధ్యత లేని పార్టీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. కైకలూరు, కలిదిండి సభలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీని తీవ్రంగా విమర్శిస్తూ గతంలో రాష్ట్రంలో నెలకొన్న నక్సలైట్ సమస్య, రాయలసీమ ఫ్యాక్షనిజం, హైదరాబాద్‌లో మత విద్వేషాలు, గంజాయి, రౌడీయిజం వంటి అంశాలను ప్రస్తావించారు. తనకు 48 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చంద్రబాబు తెలిపారు. గతంలో రాష్ట్రంలో నక్సలైట్ సమస్య తీవ్రంగా ఉండేదని గుర్తుచేశారు. తాను తిరుమల వెళ్తున్న సమయంలో నక్సలైట్లు క్లైమర్ మైన్లు పెట్టినా వెంకటేశ్వరస్వామి తనను కాపాడారని, అయినప్పటికీ తాను ఎప్పుడూ భయపడలేదని చెప్పారు.
రాయలసీమ ఫ్యాక్షనిజంపై ఉక్కుపాదం
ఒకప్పుడు రాయలసీమలో ముఠా కక్షలపై సినిమాలు తీసేవారని చంద్రబాబు అన్నారు. రాయలసీమలో ఫ్యాక్షనిజం లేకుండా చేసేందుకు అనేక చర్యలు చేపట్టామని తెలిపారు. అవసరమైన సందర్భాల్లో తమ పార్టీకి చెందిన వారినైనా అరెస్ట్ చేయించామని చెప్పారు. ఇక, హైదరాబాద్‌లో మత విద్వేషాలు రెచ్చగొట్టిన సమయంలో ఆరు నెలల పాటు కర్ఫ్యూ విధించి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) నిర్మాణంతో హైదరాబాద్‌లో అభివృద్ధి వేగం పుంజుకుందని అన్నారు.
గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లపై చర్యలు
రాష్ట్రంలో ఎవరూ రౌడీగా ఉండకూడదనే లక్ష్యంతో గతంలోనే చర్యలు చేపట్టామని చంద్రబాబు తెలిపారు. అయితే 2019–24 మధ్య కాలంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌ల అరాచకాలు పెరిగాయని ఆరోపించారు. గంజాయిని వాణిజ్య పంటగా సాగు చేసే పరిస్థితులు ఏర్పడితే శాటిలైట్ టెక్నాలజీ ద్వారా గుర్తించి చర్యలు తీసుకున్నామని చెప్పారు. చాలామంది గంజాయికి అలవాటు పడి ఇప్పటికీ ఆ వ్యసనం నుంచి బయటపడటం లేదని అన్నారు.
పొగాకు ధరలపై కేంద్రంతో చర్చలు
పొగాకు రైతులకు సరైన ధర కల్పించే అంశంపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. గతంలో ధరలు ఇప్పిస్తామని చెప్పి రైతుల పంటను తొక్కేసి పాడు చేశారని విమర్శించారు.
శాంతిభద్రతలపై కఠిన వైఖరి
ఎవరైనా మద్యం సేవించి స్వైర విహారం చేస్తుంటే పోలీసులు లా అండ్ ఆర్డర్‌ను అదుపులోకి తీసుకురావాలా? వద్దా? అని చంద్రబాబు ప్రశ్నించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. గుంటూరులో టీడీపీ కార్యకర్త కుటుంబానికి చెందిన ఆడబిడ్డను అవమానించిన ఘటనలో తాను చర్యలు తీసుకుని అరెస్ట్ చేయించానని తెలిపారు. శ్రీకాకుళంలో మహిళా ఎస్‌ఐ పట్ల కొందరు అసభ్యంగా ప్రవర్తించారని, ఆమెపై చేతులు వేసి దురుసుగా వ్యవహరించారని చంద్రబాబు పేర్కొన్నారు. రోడ్లపైకి వచ్చి గొడవలు చేయడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ప్రభుత్వం సహించదని సీఎం స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే రౌడీయిజం, అరాచకాలను అరికట్టేందుకు కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు సీఎం చంద్రబాబు..

