ప్రేమ వివాహం రెండు వర్గాల మధ్య గొడవ రేకెత్తించింది. .రెండు వర్గాలుగా విడిపోయి ఒకరినొకరు పిడకలతో విసురుకుంటూ దాడి చేసుకుంటారు. దాడి చేసుకున్న అనంతరం రెండు వర్గాలు అన్నదమ్ములు లా కలిసిపోయి ఆ ప్రేమ వివాహాన్ని జరిపిస్తారు .ఇలాంటి విచిత్ర వివాహం చూడాలంటే మనం కర్నూలు జిల్లా వెళ్లాల్సిందే. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పల గ్రామం లో ఉగాది పండుగ మరుసటి రోజున పిడకల సమరం ఆడడం దశాబ్దాల కాలం నుండి ఆనవాయితీగా వచ్చింది. పూర్వం భద్రకాళి వీరభద్ర స్వామి ప్రేమించుకుంటారు వీరి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో రెండు కులాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంటుంది. ఈ ఘర్షణ అనంతరం అందరూ కలిసి స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుపుతారు. ఇదే ఆనవాయితీగా కైరుప్పల గ్రామస్తులు ఉగాది మరుసటి రోజు స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుపుకుంటారు. ఈ కళ్యాణ మహోత్సవం సందర్భంగా గ్రామస్తులు స్వామి వారికి నైవేద్యంగా పేడతో చేసిన పిడకలను ప్రతి ఇంటి నుంచి స్వామివారికి సమర్పిస్తారు. సమర్పించిన పిడకలతో గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరినొకరు పై పిడకలతో దాడి చేసుకుంటారు. ఈ దాడిలో కొందరికి స్వల్ప గాయాలు కూడా అవుతాయి. ఈ స్వల్ప గాయాలకు స్వామివారి బండారు పూసుకుంటే గాయాలు నయం అవుతాయని వారి నమ్మకం.