ప్రముఖ విద్యావేత్త, కవి, ఇంజనీర్ డా. వి.మాలకొండారెడ్డి ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయనను ఉండేల మాలకొండారెడ్డి అంటేనే అంతా గుర్తుపడతారు. చిన్న తనం నుంచే ఆయన కవిత్వం చెప్పేవారు. చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వ్యవస్థాపకుడిగా ప్రసిద్ధి పొందారు. మాలకొండారెడ్డి 1932 ఆగస్టు 23 న ప్రకాశం జిల్లా లోని ఇనిమెట్ల గ్రామంలో జన్మించాడు. అల్లూరు, నెల్లూరులలో పాఠశాల చదువు ముగించి మద్రాసు గిండీ ఇంజనీరింగు కళాశాలలో బీఈ డిగ్రీ పూర్తిచేశారు.
ఎడిన్‌బరో యూనివర్శిటీ (బ్రిటన్) నుండి స్ట్రక్చరల్ ఇంజనీరింగులో డాక్టరేట్ సాధించారు. 1955-57లో పి.డబ్ల్యూ.డి.లో సివిల్ ఇంజనీర్‌గా పనిచేశాడు. తరువాత నాలుగు సంవత్సరాలు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆతర్వాత ఇరవై సంవత్సరాలు వరంగల్ లోని ప్రాంతీయ ఇంజనీరింగ్ కళాశాల (ఆర్.ఈ. సి) లో ప్రొఫెసర్‌గా పనిచేశారు. 1979లో చైతన్యభారతి ఇంజనీరింగ్ కళాశాల (సి.బి.ఐ.టి) ను స్థాపించారు. ఆ కాలేజీకి మొట్టమొదటి ప్రిన్సిపాల్‌గా వ్యవహరించారు. ఆ సంస్థకు ఫౌండర్ సెక్రెటరీగా, ఛైర్మన్ (2000-2003) గా, అడ్వైజర్‌గా సేవలనందించారు.
అలాగే, జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా 1996-2004ల మధ్య సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల అసోసియేషన్‌కు కార్యదర్శిగాను, జాతీయ స్థాయిలో ఫెడరేషన్ ఆఫ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజస్ అసోసియేషన్స్‌కు అధ్యక్షుడిగాను ఉన్నాడు. సుజన యూనివర్సల్ ఇండస్ట్రీస్‌కు, సుజన మెటల్స్ ప్రాడక్ట్స్ లిమిటెడ్‌కు డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆయన స్ట్రక్చరల్ ఇంజనీరింగులో ఎన్నో పరిశోధనాపత్రాలు దేశ విదేశ జర్నల్స్‌లో ప్రచురించారు. 1986లో అంతర్జాతీయ వైద్య మహానగర్ మెడిసిటీని స్థాపించాడు.
హైదరాబాదులో హోటల్ సిద్ధార్థ, నందనం అపార్ట్‌మెంట్స్, వరంగల్‌లో సిద్ధార్థనగర్, చైతన్యపురి వంటివాటిని నిర్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సెనెట్ సభ్యుడిగా గౌరవం అందుకున్నారు. ఏపీ సైన్స్ అకాడమీకి ఫెలోసభ్యుడిగా ఉన్నారు. మాలకొండారెడ్డి అనేక పుస్తకాలు ప్రచురించారు. తెలుగు విశ్వవిద్యాలయం ఆయన్ని గౌరవించింది. ఆయన సేవలకు అనేక అవార్డులు లభించాయి. ఇందిరాగాంధీ నేషనల్ అవార్డ్ 2003లో అందుకున్నారు. అమెరికల్ బయోగ్రాఫికల్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ ఆఫ్ లీడర్ షిప్ (1998) అందుకున్నారు. విద్యావేత్త మాలకొండారెడ్డి ఆకస్మిక మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. విద్య, ఇంజనీరింగ్, సేవాల రంగాలకు ఆయన లేని లోటు తీర్చలేనిదన్నారు.
Read Also: Jagan Mohan Reddy: జగన్ టూర్లకు బుల్లెట్ ఫ్రూఫ్ బస్
