NTV Telugu Site icon

జగన్ మళ్లీ సీఎం కాకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా: ధర్మాన

ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ మళ్లీ ఘనవిజయం సాధిస్తుందని… జగన్ మళ్లీ సీఎం అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ జగన్ మళ్లీ సీఎం కాకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ధర్మాన స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో డ్వాక్రా బజార్ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడుతూ… వైసీపీలో విభేదాలు రచ్చకెక్కాయంటూ టీడీపీ నేతలు ప్రచారం చేస్తుండటంపై మండిపడ్డారు. టీడీపీ నేతలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ధర్మాన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: మళ్లీ పెరుగుతున్న కేసులు… భారత్‌లో కొత్తగా 37వేల మందికి పైగా కరోనా పాజిటివ్

భగవంతుడు ఎప్పుడూ మంచి వాళ్లకు తోడుంటాడని.. అందుకే గత ఎన్నికల్లో వైసీపీని గెలిపించారని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యానించారు. సీఎం జగన్ కోసం ప్రాణాలు ఇచ్చే నాయకులు ఉన్నారని ఆయన తెలిపారు. వైసీపీలో నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. వేడినీళ్లు పోస్తే ఇల్లు కాలదని.. దానికి అగ్గిపుల్ల కావాలని.. ఈ విషయం టీడీపీ నేతలు తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. తమ పార్టీ సమష్టి కుటుంబంగా ముందుకు వెళ్తుందని… ప్రజలు, మహిళల సహకారంలో మళ్లీ అధికారంలోకి వచ్చే పార్టీ వైసీపీనే అని స్పష్టం చేశారు.