పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. సైబర్‌నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని ఎన్ని సార్లు హెచ్చరించిన మోసపోతునే ఉన్నారు. తాజాగా ఏపీలో ఆన్‌లైన్ పరికరాల పేరిట ప్రజలను బురిడీ కొట్టించారు. లవ్ లైఫ్ డ నేచురల్ హెల్త్ కేర్ ముసుగులో రూ.200 కోట్లకు టోకరా వేశారు కేటుగాళ్లు. ఈ కంపెనీ పేరిట రూ.500 నుంచి రూ.2 లక్షల వరకు హెల్త్ పరికరాలను ఆన్‌లైన్‌లో ఆ సంస్థ పెట్టింది. ఒక్కో పరికరానికి రీచార్జ్ పేరుతో బాధితుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేసింది.
రీచార్జ్ చేసుకున్నందుకు రూ.100 నుంచి రూ.2 వేల వరకు గిఫ్ట్‌లను బాధితులకు అందించింది. తమతో వేలకు వేలు పెట్టించి పరికరాలను కొనుగోలు చేయించిందని బాధితులు వాపోయారు. అయితే తాము మోసపోవడంతో విజయవాడ సైబర్ క్రైం పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. బాధితుల్లో న్యాయవాదులు, పోలీసులు, వైద్యులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఉన్నారు. సుమారు 20 లక్షల మంది బాధితులు ఉన్నట్టు సమాచారం. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలు ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
