సిమ్ కార్డుల ద్వారా మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లపై సీఐడీ అధికారులు పట్టుకున్నారు. అంతర్జాతీయ ఫోన్ కాల్‌లను లోకల్ కాల్‌లుగా మార్చి భారీ స్థాయిలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఒక ముఠాను సీఐడీ అధికారులు గుర్తించి అరెస్టు చేశారు. ఈ కేసులో ఒక వియత్నాం దేశీయుడితో పాటు మరికొందరు నిందితులను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.
అయితే.. సీఐడీ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘సిమ్ బాక్స్’ అనే ప్రత్యేక పరికరాన్ని ఉపయోగించి అంతర్జాతీయ కాల్‌లను స్థానిక కాల్‌లుగా రూటింగ్ చేస్తూ టెలికాం వ్యవస్థకు భారీ నష్టం కలిగించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ముఠా చైనా వంటి దేశాల నుంచి సిమ్ బాక్స్‌లను అక్రమంగా దిగుమతి చేసుకొని, ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ మోసాలకు పాల్పడినట్లు తెలిపారు. ఈ సైబర్ నేరగాళ్లు కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే సుమారు 20 కోట్ల రూపాయల వరకు మోసాలు చేసినట్లు సీఐడీ పేర్కొంది. అంతేకాకుండా, వీరు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఇదే తరహా నేరాలకు పాల్పడినట్లు సమాచారం.
దీంతో కొత్త సిమ్ కార్డ్ తీసుకునే సమయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు పోలీసులు సూచించారు. అనుమానాస్పద కాల్స్, విదేశీ నంబర్ల నుంచి వచ్చే కాల్స్ లేదా మోసపూరిత సమాచారం కనిపిస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలని, లేదా 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.