NTV Telugu Site icon

CPI Ramakrishna: ఏపీలో నియంత పాలన సాగుతోంది.. ఆమెకు న్యాయం చేయాలి

Cpi Ramakrishna

Cpi Ramakrishna

CPI Ramakrishna Fires On AP CM YS Jagan: అమలాపురానికి చెందిన ఆరుద్ర అనే మహిళ సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు ఆత్మహత్యకి పాల్పడిన ఘటనపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రంగా స్పందించారు. సీఎం జగన్‌కి జనం గోడు వినే తీరిక లేదా? లేకపోతే ఎందుకు వినాలన్న అహంభావమా? అని ప్రశ్నించారు. సీఎంకు విన్నవించే అవకాశం లేక.. ఆ మహిళ సీఎం కార్యాలయం ముందు ఆత్మహత్యకి పాల్పడిందన్నారు. జగన్‌కి ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి సచివాలయం నుండి పాలన లేదన్నారు. తాడేపల్లిలో సీఎం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకొని.. ముళ్ళ కంచెలు, పోలీస్ పహారా మధ్య మాత్రమే ఉంటున్నారని మండిపడ్డారు. ప్రజా వినతులు స్వీకరించే ఆలోచన సీఎంకి లేదని పేర్కొన్నారు. వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి అఖిలపక్ష సమావేశాలు జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కేవలం నిర్బంధకాండలు, అణిచివేతలతో.. నియంత పాలన మాత్రమే సాగుతోందని ఆరోపణలు చేశారు. కానిస్టేబుల్ వేధింపుల నుంచి ఆరుద్రని రక్షించి, ఆమెకు న్యాయం చేయాలని కోరారు.

కాగా.. సీఎం అపాయింట్‌మెంట్ లభించలేదన్న మనస్తాపంతో, ఆరుద్ర అనే మహిళ సీఎం కార్యాలయం ముందే తన మణికట్టు కోసుకుని బలవన్మరణం చెందేందుకు ప్రయట్నించిన విషయం తెలిసిందే. కాకినాడ జిల్లాకు చెందిన ఆరుద్రకు సాయిలక్ష్మీచంద్ర అనే కుమార్తె ఉంది. వెన్నెముక సమస్యతో బాధపడుతున్న ఆ యువతి చికిత్సకు రూ. 2 కోట్లు కావాలని వైద్యులు చెప్పారు. దీంతో తమ ఇంటిని అమ్మాలని ఆరుద్ర నిర్ణయించింది. అయితే.. తమ ఇంటిని అమ్ముకోనివ్వకుండా ఒక కానిస్టేబుల్, మరో వ్యక్తి కలిసి తమని బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్‌ని కలిసి, తన గోడు వెళ్లబోసుకుందామని కూతురితో పాటు క్యాంప్ ఆఫీస్‌కి వచ్చారు. అయితే.. అపాయింట్‌మెంట్ దక్కకపోవడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు.