NTV Telugu Site icon

విద్యుత్తు మీటర్ల తొలగింపుతో ప్రజలపై పెనుభారం : సీపీఐ రామకృష్ణ

వైసీపీ ప్రభుత్వంపై సీపీఐ కార్యదర్శి రామకృష్ణ విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్కో ఇంటికి ఒకటే మీటర్ ఉండాలంటూ విద్యుత్ పంపిణీ సంస్థలు నోటీసులివ్వడం దుర్మార్గమని ఆయన అన్నారు. దశాబ్దాల కాలం నుంచి ఒక ఇంటిలోని పోర్షన్ల ఆధారంగా విద్యుత్ సంస్థలు మీటర్లు ఇవ్వడం జరిగిందని, ఇప్పుడు ఒకే ఇంట్లో ఎన్ని పోర్షన్లు ఉన్నప్పటికీ ఓకే మీటర్ ఉంచి, మిగతావి రద్దు చేసుకోవాలని ఎలక్ట్రిసిటీ అధికారులు నోటీసులు ఇస్తున్నారని ఆయన అన్నారు. ఫలితంగా మీటర్ రీడింగ్ విపరీతంగా పెరిగి, అత్యధికంగా విద్యుత్ ఛార్జీల భారం వినియోగదారులపై పడడం ఖాయమని ఆయన వెల్లడించారు.

అమ్మఒడి, వృద్ధాప్య, వితంతు పెన్షన్ల వంటి పలు సంక్షేమ పథకాల అమలును కరెంట్ బిల్లుతో ముడి పెట్టడం గమనార్హమని ఆయన అన్నారు. ఇప్పటికే జగన్ సర్కార్ ఓటీఎస్ పేరుతో బలవంతపు వసూళ్లకు పాల్పడుతోందని, ఇప్పుడు విద్యుత్తు మీటర్ల తొలగింపుతో ప్రజలపై గుదిబండ మోపేందుకు సిద్ధమైందని ఆయన ఆరోపించారు. సంక్షేమ పథకాలలో కోతలు విధించేందుకే వైసీపీ ప్రభుత్వం ప్రజలపై పెనుభారం మోపే కుట్రలకు తెరతీసిందని,
తక్షణమే విద్యుత్ పంపిణీ సంస్థలు మీటర్ల రద్దు ప్రక్రియను విరమించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.