Site icon NTV Telugu

బీజేపీతో పొత్తును వీడి జనసేన బయటకు రావాలి..!

ఇప్పుడు ఎన్నికలు ఏమీ లేవు.. అయినా ఆంధ్రప్రదేశ్‌లో పొత్తుల వ్యవహారం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.. కుప్పం పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన లవ్‌ కామెంట్లపై పెద్ద రచ్చ జరుగుతోంది.. జనసేన పార్టీని ఉద్దేశించి చంద్రబాబు ఆ కామెంట్లు చేయగా.. బీజేపీ, వైసీపీ ఈ వ్యవహారంపై మండిపడుతోంది.. జనసేన పార్టీ తమకు మిత్రపక్షమని బీజేపీ అంటుంటే.. పొత్తులు లేకుండా చంద్రబాబు ఒక్కసారైనా గెలిచారా? అని వైసీపీ ప్రశ్నిస్తోంది.. ఇక, ఈ వ్యవహారంపై ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొత్తులు, సర్దుబాట్లు ఉంటాయన్నారు.. జాతీయస్థాయిలో అగ్రనేతల నిర్ణయం మేరకు పొత్తులు ఉంటాయన్న ఆయన.. ఇదే సమయంలో.. జనసేన పార్టీ.. బీజేపీతో పొత్తును వీడి బయటకు రావాలని సూచించారు.. ఇక, దేశాన్ని కాపాడాల్సిన ప్రధాని మోడీయే తన ప్రాణాలకే ముప్పు ఉందని చెప్పటం విడ్డూరమని సెటైర్లు వేసిన రామకృష్ణ.. నరేంద్ర మోడీ ఓట్ల రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.

Read Also: కరోనా ఎఫెక్ట్‌.. పవన్‌ కల్యాణ్ సమావేశం వాయిదా

మరోవైపు.. సీఎం వైఎస్‌ జగన్‌ పీఆర్సీ విషయంలో ఉద్యోగులను నిరుత్సాహానికి గురిచేశారని విమర్శించారు రామకృష్ణ.. ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని.. కొందరు ఉద్యోగ సంఘ నేతలు బాగానే ఉందని కంటి తుడుపు మాటలు మాట్లాడుతున్నారని.. సజ్జల రామకృష్ణారెడ్డి.. ఉద్యోగ సంఘాల నేతలతో సంతృప్తిగా ఉందని పాజిటివ్ స్టేట్ మెంట్స్ ఇప్పించారని ఆరోపించారు. ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయస్సు 62కు పెంచడం ఆమోదయోగ్యంగా లేదన్న రామకృష్ణ.. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు రావని వ్యాఖ్యానించారు. ఇక, అమరావతి విషయంలో ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని మన్నించాలని.. రాజధానిగా అమరావతి ఉంటుందని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు రామకృష్ణ.

Exit mobile version