Site icon NTV Telugu

Rajeev Gowda: మోడీ మాజీ కావడం తధ్యం..! కర్ణాటక నుంచి బీజేపీ ఓటమి షురూ అవుతుంది..!

Rajeev Gowda

Rajeev Gowda

Rajeev Gowda: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.. మే 10న పోలింగ్‌ జరగనుండగా.. 13వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నారు.. అయితే, కర్ణాటక నుంచే బీజేపీ ఓటమి ప్రారంభం అవుతుందంటున్నారు ఏఐసీసీ అధికార ప్రతినిధి రాజీవ్ గౌడ.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ వచ్చింది.. బీజేపీ ఓటమి ఇక్కడి నుంచే ప్రారంభం‌ అవుతుంది. 2024 ఎన్నికల తరువాత కాంగ్రెస్ విజయం ఖాయం.. మాజీ ప్రధానిగా మోడీ మారడం తధ్యం అని జోస్యం చెప్పారు.. అదాని ఆర్థిక అవతవకలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఎందుకు నియమించడం లేదు..? అని ప్రశ్నించిన ఆయన.. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే రాహుల్ గాంధీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని స్పష్టం అవుతుందన్నారు.. దేశాన్ని బీజేపీ కార్పొరేట్లకు అమ్మాలని చూస్తోంది. ఆర్ధిక అవతవకలకు పాల్పడుతున్నారని ఆధారాలున్నా.. కేంద్ర ప్రభుత్వం తన తీరును సమర్థించుకుంది.. అదానీ, మోడీ మధ్య సంబంధాలు వాస్తవం అన్నారు.

Read Also: RUDA: రాజమహేంద్రవరంలో మరో 65 గ్రామాలు విలీనం..

ప్రజలను దృష్టి మళ్లించడానికి అనవసర అంశాలను వివాదం చేస్తున్నారంటూ బీజేపీపై మండిపడ్డారు రాజీవ్‌ గౌడ.. పార్లమెంట్ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడిన ప్రతి అంశానికి ఆధారాలు ఉన్నాయన్న ఆయన.. దర్యాప్తు సంస్థలను జేబు సంస్థలుగా మార్చుకున్నారు. హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై కేంద్రం ఎందుకు నోరు మెదపడం లేదు..? అని నిలదీశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టి కేంద్ర ప్రభుత్వం అవినీతికి అండగా ఉంటుంది. రక్షణ రంగంలోకి ప్రైవేట్ సంస్థల్ని ఎలా ఆహ్వానిస్తారు..? అని ప్రశ్నించారు. అనుభవం, అర్హత లేని వారిని రక్షణ రంగంలోకి తీసుకు రావాలని చూస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను దుర్వినియోగం చేస్తున్నారు అని ఆరోపించారు. గంగవరం, కృష్ణపట్నం, ముంబై పోర్టులను అదాని పరం చేసుకున్నారు. వాటిని తాకట్టు పెట్టి, లోన్స్ తీసుకొని ఎగ్గొడుతున్నా.. కేంద్రం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.

Read Also: Economic Crisis: పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం…పిండి కోసం కొట్టుకున్న జనం!

ప్రధాని మోడీ ప్రజల కోసం కాకుండా పెట్టుబడి దారుల కోసం పని చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు రాజీవ్‌గౌడ.. ఈడీని ప్రయోగించి ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీల నేతలను బెదిరిస్తున్నారు.. కేంద్రం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ కార్పొరేట్ల కోసమే పెట్టినట్లుగా ఉందన్నారు. ప్రజల నుంచి పన్నుల రాబట్టడం కోసమే బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు కనిపిస్తుందని మండిపడ్డ ఆయన.. రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పలేక పోతున్నారు..? అని నిలదీశారు. అదానీ విషయంలో సెబీ ఇచ్చిన ఆధారాలు కూడా కేంద్రం ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదన్న ఆయన.. దేశంలో వ్యవస్థలు నాశనం అవుతున్నాయి కాబట్టే మేము చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. మోడీ మాయలు మాని.. ప్రజలకు మేలు‌ చేసే పనులు‌ చేయాలని సూచించారు. కక్ష సాధింపు రాజకీయాలను మా పోరాటాలు ద్వారా ఎదుర్కొంటామని ప్రకటించారు ఏఐసీసీ అధికార ప్రతినిధి రాజీవ్ గౌడ..

Exit mobile version