ఇవాళ ఢిల్లీలో కీలక న్యాయ సదస్సు జరగనుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు,ముఖ్యమంత్రులు ఈ సదస్సులో పాల్గొంటారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ సదస్సుని ప్రారంభించనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ, ఇతర సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ సదస్సుకి హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ నుంచి న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొంటారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా పాల్గొంటారు.
సదస్సులో న్యాయస్థానాల్లో ఐటీ వినియోగం, మౌలిక సదుపాయాలు, వసతులు కల్పన,న్యాయమూర్తుల భర్తీ, కోర్టుల సిబ్బంది భర్తీ, న్యాయవ్యవస్థలో తీసుకురావాల్సిన సంస్కరణలపై ప్రధానంగా చర్చించనున్నారు. నిన్నటి సీజేల సమావేశం ఆధారంగా రూపొందించిన నివేదికను కేంద్రం ముందు వుంచనున్నారు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ. ఢిల్లీలోని విజ్ఞాన భవన్ లో జరగనున్న న్యాయ సదస్సులో సత్వర న్యాయం దిశగా ముందడుగులు పడతాయని న్యాయనిపుణులు భావిస్తున్నారు. ఈ సదస్సులో చర్చించాల్సిన అంశాల గురించి ఇప్పటికే ఏపీ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తితో సీఎం జగన్ చర్చించిన సంగతి తెలిసిందే. న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు 1953లో తొలిసారి ఇలా ప్రధాన న్యాయమూర్తుల సదస్సుకి అంకురార్పణ జరిగింది. అప్పటినుంచి ఇప్పటివరకు 38 సదస్సులు పూర్తయ్యాయి.
చివరి సదస్సు 2016లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.ఠాకుర్ నేతృత్వంలో జరిగింది. అప్పటి సదస్సులో ప్రతిపాదించిన అంశాలు ఎంతవరకూ అమలయ్యాయనేది తాజాగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. వివిధ జిల్లా కోర్టుల్లో మౌలికవసతుల అభివృద్ధికోసం కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లో స్పెషల్ పర్పస్ వెహికిల్‌గా జ్యుడీషియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అథారిటీలను ఏర్పాటుచేయడంపై ఈ సదస్సులో చర్చిస్తారు. హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల కోసం సిఫార్సులను వేగవంతం చేయాలని ఇప్పటికే సీజేఐ భావిస్తున్నారు. ఖాళీగా వున్న న్యాయమూర్తుల స్థానాలను సాధ్యమయినంత వేగంగా భర్తీచేయాలని జస్టిస్ ఎన్వీరమణ యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ న్యాయసదస్సుకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.
CJI NV Ramana: త్వరలోనే హైకోర్టుల్లో జడ్జీల నియామకం.. పేర్లు సూచించండి..!