యాస్ తుఫాన్ నేపథ్యంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు ఏపీ సీఎం వైఎస్ జగన్… వాతావరణ శాఖ నివేదికలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.. తుఫాన్ కదలికలను ఎప్పటికప్పుడు చూసుకుంటూ అవసరమైన చర్యలను తీసుకోవాలన్న సీఎం.. అధికారులు, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.. ఇక, శ్రీకాకుళం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎస్ ఆదిత్యనాథ్ దాస్.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పరిస్థితులను వివరించారు.. శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడా జల్లులు తప్ప ప్రస్తుతానికి పెద్దగా ప్రభావం కనిపించడంలేదన్న ఆయన… ఉన్నతాధికారులంతా ఇక్కడే ఉన్నారని వివరించారు.. తాత్కాలిక నిర్మాణాల్లో కోవిడ్ రోగులు లేకుండా అన్నిరకాల చర్యలు తీసుకున్నామన్న సీఎస్.. ఆక్సిజన్ కొరత రాకుండా కూడా చర్యలు తీసుకున్నట్టు వివరించారు.. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే ప్రత్యామ్నాయంగా జనరేటర్లు, డీజిల్ అన్నీ సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో తీసుకున్న చర్యలను కలెక్టర్ నివాస్ వివరించారు.. ఒడిశా అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని తెలిపారు. ఆక్సిజన్ ట్యాంకర్ల రవాణాలో ఇబ్బందులు వస్తే వెంటనే సమస్య తీర్చడానికి ఇచ్ఛాపురం వద్ద ప్రత్యేక బృందాలను పెట్టామన్నారు.
మరోవైపు.. విజయనగరం జిల్లాలో పరిస్థితులను వివరించారు కలెక్టర్ జవహర్.. జిల్లాలో ఇప్పటివరకు తుఫాన్ ప్రభావం ఏమీ కనిపించలేదన్న జవహర్.. తుఫాన్ పరిస్థితులను ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామన్నారు.. కోవిడ్ రోగులు ఉన్న 28 ఆస్పత్రుల్లో అన్నిరకాల జనరేటర్లు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.. నాలుగు రోజులకు సరిపడా డీజిలు అందుబాటులో ఉంచామని సీఎంకు వివరించారు.. నాలుగు రోజులకు సరిపడా మందులను ముందుగానే ఆయా ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచామని వెల్లడించారు. 4 రోజులకు సరిపడా ఆక్సిజన్ నిల్వలను అందుబాటులో ఉంచామని వెల్లడించారు. ఇక, కోవిడ్ కేర్ సెంటర్లలో ఆహారానికి లోటులేకుండా, సిలెండర్లు కూడా సిద్ధంగా ఉంచామని.. కరెంటు సరఫరాకు ఇబ్బంది వచ్చిన పక్షంలో పోల్స్, ట్రాన్స్‌ఫార్మర్స్ అందుబాటులో ఉంచుకున్నామని సీఎంకు తెలిపారు విశాఖ కలెక్టర్.. ఐఎండీ అలర్ట్స్‌ను మండలస్థాయి అధికారుల వరకూ పంపిస్తున్నాం.. విశాఖ జిల్లాలో పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయన్నారు. జిల్లాల్లో కోవిడ్‌రోగులకు సేవలు అందిస్తున్న సుమారు 80కి పైగా ఆస్పత్రుల్లో అన్నిరకాలుగా చర్యలు తీసుకున్నామని.. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసుకున్నామని వెల్లడించారు.