ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తాజా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్ జగన్.. వివిధ ప్రాంతాల్లో కోవిడ్ విస్తరణ పరిస్థితులను ఈ సందర్భంగా సీఎంకు వివరించారు అధికారులు.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్న అధికారులు.. అన్ని జిల్లాల్లో కలిపి 53,184 పడకలు సిద్ధంగా ఉన్నాయని.. రాష్ట్రంలో దాదాపు 27వేల యాక్టివ్ కేసుల్లో కేవలం 1100 మంది మాత్రమే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.. వీరిలో ఆక్సిజన్ అవసరమైన వారి సంఖ్య సుమారు 600 మంది మాత్రమే అన్నారు.. సుమారు 28వేల బెడ్లను సిద్ధంచేశామని సీఎంకు వివరించారు.. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం.. రెండో డోస్ వ్యాక్సినేషన్‌లో మిగతా జిల్లాలతో పోలిస్తే దిగువన ఉన్న ఐదు జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న ఆయన.. తూర్పుగోదావరి, గుంటూరు, కడప, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రెండో డోస్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.. 15 నుంచి 18 ఏళ్లవారికీ 100శాతం వ్యాక్సినేషన్‌ను నెల్లూరు, ప.గో. జిల్లాలు పూర్తి చేశాయని.. మరో 5 జిల్లాల్లో 90 శాతానికి పైగా ఈ వయసులవారికి వ్యాక్సినేషన్ పూర్తి కాగా.. మరో నాలుగు జిల్లాల్లో 80 శాతానికి పైగా వ్యాక్సినేషన్ జరిగిందన్నారు.. మిగిలిన జిల్లాలతో పోలిస్తే తక్కువగా ఉన్న విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు సీఎం వైఎస్ జగన్.
Read Also: నారా లోకేష్‌కు కరోనా
ఇక, కోవిడ్ పరీక్షల్లో కేంద్రం కొత్త మార్గదర్శకాలపైనా సమావేశంలో చర్చ జరిగింది.. కోవిడ్ లక్షణాలు లేనివారికి ఎలాంటి పరీక్షలు చేయొద్దని ఐసీఎంఆర్ కొత్త మార్గదర్శకాల్లో పేర్కొందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు అధికారులు.. కోవిడ్ పాజిటివ్ తేలిన వారి కాంటాక్ట్స్‌లో కేవలం హైరిస్క్ ఉన్నవారికి పరీక్షలు చేయాలని ఐసీఎంఆర్ స్పష్టం చేసిందన్నారు.. ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు.. మరోవైపు.. బూస్టర్ డోస్ విషయంలో కేంద్రానికి లేఖ రాయాలని సీఎం జగన్ నిర్ణయించారు.. బూస్టర్ డోస్ వేసుకునేందుకు ఇప్పుడున్న 9 నెలల వ్యవధిని 6 నెలల వ్యవధికి తగ్గించాలంటూ కేంద్రానికి లేఖరాయాలని నిర్ణయించారు.. ఈ వ్యవధిని 3 నుంచి 4 నెలలు తగ్గించే దిశగా ఆలోచన చేయాలని కేంద్రానికి లేఖ రాయాలని సీఎం నిర్ణయానికి వచ్చారు.. దీని వల్ల ఫ్రంట్‌లైన్ వర్కర్లకు, అత్యవసర సర్వీసులు అందిస్తున్నావారికి ఉపయోగమని సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.. అంతేకాకుండా ఆస్పత్రిపాలు కాకుండా చాలామందిని కోవిడ్‌నుంచి రక్షించే అవకాశం ఉంటుందని.. అందుకే దీనిపై కేంద్రానికి లేఖ రాయాలనే నిర్ణయానికి వచ్చారు సీఎం వైఎస్ జగన్.