ఓవైపు సంక్షేమ పథకాల అమలులో దూసుకుపోతున్న వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇప్పుడు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు.. పార్టీ కార్యకర్తలతో నేరుగా భేటీ అయ్యేందుకు పార్టీ అధ్యక్షుడి హోదాలో రంగంలోకి దిగుతున్నారు.. నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టతతో పాటు.. ప్రత్యర్థులను కట్టడి చేయడంపైనే ప్రధానంగా దృష్టి సారించబోతున్నారు.. ఆగస్టు 4వ తేదీ నుంచి నియోజకవర్గాల వారీ సమీక్షలు నిర్వహిస్తానని ఇటీవల జరిగిన సమావేశంలో సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే కాగా.. ఇవాళ్టి నుంచి ఆ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది.. అందులో మొదటగా కుప్పం నియోజకవర్గంపైనే ఫోకస్ పెట్టారు వైసీపీ అధినేత… మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతినిథ్యం వహిస్తున్న కుప్పం నుంచే.. సమీక్షలు ప్రారంభించనున్నారు. సమీక్షలో భాగంగా నియోజకర్గాల్లో పరిస్థితులు, పురోగతి, పార్టీ బలోపేతం, అభివృద్ధిని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే అంశాలపై చర్చించనున్నారు.
Read Also: Ramdev Baba: వివాదాస్పద వ్యాఖ్యలు.. కొవిడ్ టీకా ఓ ఫెయిల్యూర్
అయితే, వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత కార్యకర్తలతో నేరుగా సంప్రదింపులు జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి.. ఈ విషయంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కొంత అసహనంగా ఉండటంతో.. నేరుగా రంగంలోకి దిగుతున్నారు వైఎస్ జగన్… కార్యకర్తలతో మాట్లాడటం ద్వారా వారిలో ఉత్సాహం నింపనున్నారు.. ఒకవైపు ఎన్నికలు వచ్చేస్తున్నాయని ప్రతిపక్ష టీడీపీ చెబుతుండగా, ఏ సమయంలో ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు వైసీపీ నేతలు హితబోధ చేశారు. ఇక, ఇవాళ కుప్పం నియోజకవర్గం నుంచి సమీక్ష సమావేశాలు ప్రారంభం కానున్నాయి.. సాయంత్రం ఐదున్నర గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తారు.. కుప్పం నియోజకవర్గం నుంచి ఇప్పటికే విజయవాడకు చేరుకున్నారు స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు .
ఇక, చంద్రబాబుకు కంచుకోట అయిన కుప్పంపై ఫోకస్ పెట్టారు సీఎం జగన్.. నెలకు పది నుంచి 15 నియోజకవర్గాల కార్యకర్తలతో సీఎం సమావేశం కానున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో నిర్వహిస్తున్న గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అభ్యర్ధనలు.. సమస్యల గురించి ఇందులో చర్చించనున్నారు. కుప్పం టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోట. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇవాళ్టి సమావేశంపై కుప్పం నియోజకవర్గ ఇంచార్జ్ భారత్ కుమార్ ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. సీఎం మొదటగా మా నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం కావాలని నిర్ణయించటం చాలా ఆనందంగా ఉందన్నారు.. ప్రతి మండలం నుంచి సీనియర్ నాయకులు, ముందు నుంచీ పార్టీకి పని చేస్తున్న వారు వచ్చారు.. ఐపాక్ టీం ఈ జాబితా సిద్ధం చేసిందన్నారు.. మండలాల వారీగా ముఖ్యమైన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం.. ఎన్నికలకు ముందు చురుగ్గా ఉండి వివిధ కారణాల వల్ల స్తబ్దుగా ఉన్న వాళ్ళు ఈ జాబితాలో ఉన్నారని వెల్లడించారు.. ముఖ్యమంత్రితో వ్యక్తిగత భేటీ కావటం వల్ల మేం రెట్టించిన ఉత్సాహంతో నియోజకవర్గానికి వెళ్తామని తెలిపారు.. కుప్పం నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. 2024లో కుప్ పై వైసీపీ జెండా ఎగరటం ఖాయం అని నమ్మకాన్ని వ్యక్తం చేశారు భారత్ కుమార్.