వైద్య ఆరోగ్యశాఖలో భారీ రిక్రూట్‌మెంట్‌కు సిద్ధం అవుతోంది ఏపీ ప్రభుత్వం.. సిబ్బంది కొరతలేని ప్రభుత్వాసుపత్రి దిశగా పటిష్ట చర్యలు తీసుకుంటుంది సర్కార్.. అందులో భాగంగా సుమారు 14,200 పోస్టుల భర్తీకి సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి వైద్యకళాశాల, బోధనాసుపత్రుల వరకూ వివిధ రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు.. అక్టోబర్ నుంచి ప్రక్రియను ప్రారంభించి.. నవంబర్ 15 నాటికి ముగించాలన్న ప్లాన్‌కు సీఎం ఆమోదం తెలిపారు.. వైద్య ఆరోగ్యశాఖపై ఇవాళ సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్ జగన్.. కోవిడ్–19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌తో పాటు వైద్య ఆరోగ్యశాఖపై క్యాంప్ కార్యాలయంలో సమీక్ష జరిగింది.. సిబ్బంది కొరతలేకుండా నియామకాలపై సమావేశంలో ప్రధానంగా చర్చ సాగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకూ వివిధ స్థాయిల్లో ప్రస్తుతం ఉన్న సిబ్బంది, కావాల్సిన సిబ్బందిపై వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం.. జాతీయస్థాయిలో ప్రమాణాలు, ప్రస్తుతం ఉన్న అవసరాలు తదితర వివరాలపై ఆరా తీశారు.
ఇక, ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యులు, సిబ్బంది కొరత ఉండకూడదని స్పష్టంచేశారు.. కోట్లాది రూపాయలు ఖర్చుచేసి ఆస్పత్రులను నిర్మిస్తున్నాం, తీరా అక్కడ చూస్తే.. సిబ్బంది లేక రోగులకు సేవలు అందని పరిస్థితి ఉందని.. సంవత్సరాల తరబడి ఇలాంటి సమస్యలే మనం నిత్యం చూస్తున్నాం అని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ఇకపై దీనికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది.. వైద్యంకోసం భారీగా ఖర్చులు చేయాల్సిన పరిస్థితి పోవాలన్నారు. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందాలని.. ఈ లక్ష్యం దిశగా అడుగులు వేయాలని.. కావాల్సిన సిబ్బంది వెంటనే నియమించాలని ఆదేశించారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తోపాటు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు సరిపడా సిబ్బందితో సమర్థవంతంగా నడపాలని సూచించిన ఏపీ సీఎం.. ఒక డాక్టరు సెలవులో వెళ్తే.. ఆ స్థానంలో మరో డాక్టరు విధులు నిర్వహించేలా… దీనికి తగిన సంఖ్యలో వైద్యులను నియమించాలని.. డాక్టరు సెలవు పెడితే.. రోగులకు వైద్యం అందని పరిస్థితికాని, తోటి డాక్టర్లపై భారం పడే పరిస్థితి కాని ఉండకూడదని స్పష్టం చేశారు.