నాడు-నేడు కార్యక్రమంతో ఏపీలో ప్రభుత్వ పాఠశాలల దశ, దిశ సమూలంగా మారిపోయాయి. ఈ కార్యక్రమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలో రూపుదిద్దుకున్న ఓ పాఠశాలను నేడు సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అలాగే జగనన్న విద్యాకానుకకు ఇక్కడే శ్రీకారంచుట్టబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో పదో తరగతి వరకు చదువుతున్న 47 లక్షల 32 వేల మంది విద్యార్థులకు… ఈ విద్యా కానుకను అందిస్తారు. జగనన్న విద్యాకానుక కిట్టులో బై లింగువల్ పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్కులు, వర్క్ బుక్కులు, 3 జతల యూనిఫామ్ క్లాత్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూల్ బాగ్ ఇవ్వనున్నారు. ఈసారి అదనంగా ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్-తెలుగు డిక్షనరీ అందించనున్నారు.
సీఎం జగన్ ఇవాళ ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుండి హెలికాప్టర్‌లో బయలుదేరి.. 11 గంటలకు తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం మండలం పోతవరం గ్రామంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడ నుండి పి.గన్నవరం జడ్పీ హైస్కూల్‌కు వెళ్తారు. హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన నాడు-నేడు పైలాన్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.