Site icon NTV Telugu

CM Jagan: ఈనెల 27న నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన

Jagan

Jagan

CM Jagan: ఏపీ సీఎం జగన్ ఈనెల 27న నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ముత్తుకూరు మండలం నేలటూరు గ్రామంలో ఏపీ జెన్‌కో థర్మల్ పవర్ స్టేషన్‌లోని మూడో యూనిట్‌ను సీఎం జగన్ జాతికి అంకితం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా ఇతర కీలక నేతలు హాజరు కానున్నారు. థర్మల్ పవర్ ప్లాంట్‌లోని మూడో యూనిట్‌ పూర్తి సామర్థ్యం 800 మెగావాట్లు అని అధికారులు వెల్లడించారు. అయితే సీఎం జగన్ పర్యటనను అడ్డుకుంటామని వామపక్షాల నేతలు హెచ్చరిస్తున్నారు. జెన్‌కోను ప్రైవేటుపరం చేస్తున్నారన్న సమాచారం తమకు ఉందని ఆరోపిస్తున్నారు.

Read Also: Imran Khan: ఏడు చోట్ల పోటీ చేశాడు.. ఆరు చోట్ల గెలిచాడు..!!

ఈ నెల 27న ముఖ్యమంత్రి జగన్‌ రాక సందర్భంగా ఏర్పాట్లను జెన్ కో ఎండీ శ్రీధర్ పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఆయన జెన్‌కో ప్రైవేటీకరణ అంశంపై స్పందించారు. థర్మల్‌ కేంద్రాన్ని, దాని ఆస్తులను ఎవరికీ అప్పగించడం లేదని స్పష్టం చేశారు. జెన్‌కో నిర్వహణ కంటే తక్కువ ఖర్చుతో విద్యుత్‌ ఉత్పత్తి చేయగలిగే అవకాశం కోసం ప్రైవేటు టెండర్లు పిలిచామన్నారు. కేవలం విద్యుత్‌ ఉత్పత్తి నిర్వహణను మాత్రమే ప్రైవేటు పరం చేస్తున్నట్లు చెప్పారు. కాగా ఈ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టును 2015లో అప్పటి సీఎం చంద్రబాబు, అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. 20వేల కోట్ల రూపాయల ఖర్చుతో ఈ ప్రాజెక్టు నిర్మించారు. ఇందులో మొత్తం మూడు యూనిట్లు ఉండగా ఒక్కో యూనిట్‌ 800 మెగావాట్ల చొప్పున విద్యుత్ ఉత్పత్తి చేసే లక్ష్యంతో తయారు చేశారు. ప్రస్తుతం రెండు యూనిట్లు పనిచేస్తున్నాయి. మూడో యూనిట్ పనులు కూడా పూర్తికాగా ప్రస్తుతం టెస్ట్ రన్ జరుగుతోంది. పరిశీలనలోనే 300 మెగావాట్లకుపైగా సామర్థ్యంతో మూడో యూనిట్ పనిచేస్తోంది.

Exit mobile version